LIQUOR BOTTLE IN RETURN GIFT | వీళ్లు మామూలోళ్లు కాదుగా.. పెళ్లికొచ్చిన బంధువులకు రిటర్న్‌ గిఫ్ట్‌లుగా లిక్కర్‌ బాటిళ్లు..!

చెన్నై: పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, సీమంతాలు, గృహప్రవేశాలు లాంటి ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులకు రిటర్న్‌ గిఫ్టులు ఇవ్వడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్నది. అయితే రిటర్న్‌ గిఫ్టులుగా వస్త్రమో, వస్తువో ఇవ్వడం సాధారణమే. కానీ ఇటీవల పుదుచ్చేరిలో ఓ పెళ్లివారు మాత్రం లిక్కర్‌ బాటిళ్లను రిటర్న్‌ గిఫ్టులుగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపర్చారు.

పుదుచ్చేరిలో సాధారణంగా శుభకార్యం జరిగినప్పుడు ఆ కార్యానికి విచ్చేసిన బంధుమిత్రులకు కొబ్బరికాయ, అరటిపండు, తమలపాకులు, కుంకుమతో కూడిన తాంబూలాలు ఇస్తారు. అలాగే ఈ పెళ్లివారు కూడా ఓ బ్యాగులో తాంబూలాలు పెట్టి ఇచ్చారు. అయితే ఆ బ్యాగు తెరిచి చూసుకున్న బంధువుల్లో కొందరు మురిసిపోతే, మరికొందరు షాకయ్యారు. ఎందుకంటే ఆ బ్యాగుల్లో కొబ్బరికాయ, అరటిపండు, తమలపాకులు, కుంకుమతోపాటుగా 180 మిల్లీలీటర్ల లిక్కర్‌ బాటిల్‌ కూడా ఉంది.

కాగా, ఈ ఘటన గురించి తెలిసి కొందరు నవ్వుకుంటుండగా, ఇంకొందరు మాత్రం సీరియస్‌ స్పందిస్తున్నారు. ఘటనపై పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పెళ్లిలో రిటర్న్‌ గిఫ్టులుగా లిక్కర్‌ బాటిళ్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

2023-06-02T13:30:19Z dg43tfdfdgfd