ఆమెకు సఖి బాసట

  • మహిళలకు భరోసానిస్తున్న కేంద్రాలు
  • సమస్యల పరిష్కారానికి చర్యలు
  • సేవలపై విస్తృత అవగాహన
  • సత్ఫలితాలిస్తున్న కార్యక్రమాలు

నిర్మల్‌ చైన్‌గేట్‌, మార్చి 18 : వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖి కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. సమస్యలు తెలుసుకొని సత్వరమే వారికి సాయం అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి. అఘాయిత్యాలు, అన్యాయాలకు గురైన మహిళలు, గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, పోక్సో, మిస్సింగ్‌, చీటింగ్‌, ప్రేమ పేరుతో వేధింపులు, వరకట్నం తదితర సమస్యలతో బాధపడుతున్న వారు సఖి కేంద్రాలకు వస్తున్నారు. నూతనంగా ఏర్పడిన నిర్మల్‌ జిల్లా కేంద్రంలో సఖి కేంద్రం ఏర్పాటు చేయగా.. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 970 కేసులు వచ్చాయి. అందులో886 కేసులు పరిష్కరించగా.. 84 పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా సఖి కేంద్రం అందిస్తున్న సేవలపై గ్రామాలు, పట్టణాల్లో మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఆరు నెలల క్రితం.. ఓ మహిళ గర్భవతిగా ఉన్న సమయంలో భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బాధిత మహిళకు బాబు జన్మించిన తర్వాత నిర్మల్‌ సఖీ కేంద్రాన్ని ఆశ్రయించింది. కేంద్రం సిబ్బంది భర్త, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. భర్త మనసు మారగా.. దంపతులిద్దరూ కలిసి ఉంటున్నారు. నిర్మల్‌కు చెందిన ఓ మహిళకు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అక్కడ అత్తగారింట్లో ఆ మహిళ నిత్యం మానసిక వేధింపులే ఎదురయ్యాయి. దీంతో బాధిత మహిళ నిర్మల్‌లోని సఖీ కేంద్రాన్ని ఆశ్రయించింది. కేంద్రం సిబ్బంది బాధిత మహిళ, భర్త, కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. భర్తకు నచ్చజెప్పారు. భర్త అర్థం చేసుకొని నిర్మల్‌కు వచ్చి ఇక్కడే జీవనోపాధి వెతుక్కున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.

ఐదు రకాల సేవలు..

బాధిత మహిళలకు సఖి కేంద్రాల నుంచి ఐదు రకాల సేవలు అందిస్తున్నారు. వైద్యసహాయం, తాత్కాలిక వసతి, న్యాయ సలహా, కౌన్సెలింగ్‌, పోలీస్‌ రక్షణ తదితర సేవలున్నాయి. వాటితో పాటు పగలు, రాత్రి కానీ బాధిత మహిళలు భయానక పరిస్థితుల్లో ఉంటే తక్షణమే తమ వాహనంలో వెళ్లి సఖి కేంద్రానికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారు.

రాజీ ద్వారా సమస్యలు పరిష్కారం..

సఖి కేంద్రాలకు వచ్చే వారిలో గృహహింస, భార్యాభర్తల మధ్య తగాదాలు, మనస్పర్థలు, వరకట్నం, అత్తామామల వేధింపులు, ఆడపడుచులు, తోటికోడళ్లతో వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. బాధిత మహిళలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇబ్బందులకు గురిచేస్తే, గృహహింస కింద కేసు నమోదైతే పడే శిక్షలపై అవగాహన కల్పిస్తున్నారు. చట్టం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. కౌన్సెలింగ్‌ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధిత మహిళకు న్యాయాన్ని చేకూరుస్తున్నారు.

ఏ సమయంలోనైనా స్పందిస్తున్నాం..

బాధిత మహిళలు ఫోన్‌ ద్వారా తమను సంప్రదిస్తున్నారు. వారు ఏ సమయంలో సమాచారం అందించినా వెంటనే స్పందిస్తున్నాం. వారికి తగిన రక్షణ కల్పించి న్యాయం చేకూరుస్తున్నాం. భర్త, అత్త, మామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని పలువురు మహిళలు ఫోన్‌ చేస్తుంటారు. వెంటనే స్పందించి సఖి కేంద్రం వాహనంలో తీసుకొచ్చి వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం. మరుసటి రోజు కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి సమస్య పరిష్కరిస్తున్నాం. కేసు వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు బాధితులకు కావాల్సిన పోలీసు, వైద్య, న్యాయ సేవలు అందిస్తున్నాం.

– మమత, సఖి కేంద్రం నిర్వాహకురాలు, నిర్మల్‌

నిర్మల్‌ సఖి కేంద్రానికి వచ్చిన కేసులు : 970

పరిష్కరించబడిన కేసులు : 886

పరిష్కారానికి ఉన్న కేసులు : 84

గృహ హింస వేధింపులు : 711

మానసిక, సామాజిక కౌన్సిలింగ్‌ సేవలు : 2755

న్యాయ సేవలు : 82

ఆశ్రయం పొందినవారు : 226

ఆరోగ్య సేవలు పొందినవారు : 51

అత్యవసర రెస్క్యూ చేసిన కేసులు : 25

మహిళలకు ఉచిత టోల్‌ఫ్రీ నంబర్‌ : 181

నిర్మల్‌ సఖి కేంద్రం ఫోన్‌నెంబర్‌ : 8500540181

2023-03-18T22:35:05Z dg43tfdfdgfd