ఈ నాలుగు సంకేతాలు కనిపిస్తే మీరు మీ కళ్లద్దాలు మార్చుకోవాలి

చూపులో స్పష్టతను ఏటా పరీక్షించుకోవాలని డాక్టర్ మార్క్ డన్‌బార్ సూచిస్తున్నారు.

డన్‌బార్ యూనివర్సిటీ ఆఫ్ మియామీలోని బాస్కామ్ పామర్ స్కూల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో ఆప్తాల్మాలజీ విభాగం డైరెక్టర్.

ఇది అమెరికాలోని అత్యుత్తమ కంటి ఆసుపత్రులలో ఒకటిగా పేరు గాంచింది.

"కొంత మందికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కంటి పరీక్ష సరిపోతుంది. సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మరీ మంచిది" అని డన్‌బార్ బీబీసీ ముండోతో అన్నారు.

సరైన కంటి చూపు చాలా అవసరం. మనలో చాలా మంది కంటి ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపరు. మన కళ్లు బాగా చూడగలవని అనుకుంటాం. లేదా ఏదో ఒక సమయంలో మనం కంటి వైద్యుడిని సంప్రదించి, వారి సలహాతో అద్దాలు తీసుకొని వదిలేస్తాం.

"మంచి దృష్టి ఉన్న వ్యక్తులు తమ కళ్లను పెద్దగా పట్టించుకోరు. నలభై లేదా యాభైలలోని వ్యక్తులు కంటి పరీక్ష చేయించుకోకపోవడం అసాధారణమైతే కాదు" అని డన్‌బార్ చెప్పారు.

రెండు కళ్ల మధ్య దృష్టి నాణ్యతలో తేడాలు, సాధారణ దృష్టి లోపం కూడా చాలా మంది తెలుసుకోలేరని డన్‌బార్ చెబుతున్నారు.

కంటి డాక్టర్‌ను చూడాల్సిన సమయం ఆసన్నమైందని సూచించే కొన్ని సంకేతాలను డన్‌బార్ వివరించారు. ఈ లక్షణాలు కనిపిస్తే మీ అద్దాలు మార్చడానికి ఇదే సమయం.

1. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సిగ్నల్స్ చూడలేకపోవడం

"మీరు అకస్మాత్తుగా రహదారి సిగ్నల్స్ చూడటానికి లేదా చదవడానికి ప్రయత్నించినప్పుడు, మీరు దాని దగ్గరకు వెళ్లేవరకు చూడలేకపోవడం. అది హెచ్చరికే." అని డాక్టర్ డన్‌బార్ చెప్పారు.

కెమెరా మాదిరి మీ కళ్లు రెటీనాపై కాంతిని కేంద్రీకరించాలి. అప్పుడే మీరు స్పష్టంగా చూడగలుగుతారు.

మయోపియా ఉన్న వారికి కాంతి రెటీనా ముందు కేంద్రీకృతమై ఉంటుంది. ఫలితంగా రోడ్డు పక్కన సిగ్నల్స్ వంటి సుదూరమైనవి అస్పష్టంగా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితులలో ముఖ్యంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ సవాలుగా మారుతుంది.

కాంతి కంటికి తగిలేలా దాని ఉపరితలం అంతటా ఆ కాంతి సమానంగా వ్యాపించేలా కంటి అద్దాలు పని చేస్తాయి. యాంటీ-రిఫ్లెక్టివ్ లెన్స్ టెక్నాలజీతో కూడిన అద్దాలు మీ దృష్టిని మరింత మెరుగుపరుస్తాయి.

2. పుస్తకం చదవడం కష్టమైతే..

మీకు పుస్తకాన్ని చదవడం లేదా మీ మొబైల్ ఫోన్ స్క్రీన్‌‌ను అద్దాలు పెట్టుకుని చూడటం కష్టంగా అనిపిస్తే, కంటి వైద్యుడిని సంప్రదించాల్సిన సమయం వచ్చిందని తెలుసుకోవాలి.

వయసు పెరిగేకొద్దీ రెటీనా దాని మృదుత్వం కోల్పోతుంది. దీంతో సమీపంలోని వస్తువులను చూడటం కష్టమవుతుంది.

సమస్య, కాంతి దిశ మార్పులో ఉంది. రెటీనాపై కాంతి సరిగ్గా కేంద్రీకృతం కాకపోతే, మీరు చూసే వస్తువు అస్పష్టంగా కనిపిస్తుంది.

దృష్టిలోపం సమస్యను సరిదిద్దితే మీరు చదవడానికి ప్రయత్నించినప్పుడు అద్దాలు కూడా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయకుండా నిరోధిస్తాయి.

3. రోజంతా దృష్టిలో హెచ్చుతగ్గులు

రోజంతా మీ దృష్టిలో హెచ్చుతగ్గులుంటున్నాయని మీరు భావిస్తే మీ అద్దాలను మార్చడానికి ఇదే సమయమని సంకేతం.

కంటి కండరాలు అలసిపోవడం దీని ప్రధాన కారణాలలో ఒకటి అని డన్‌బార్ చెబుతున్నారు.

మీరు కంప్యూటర్ స్క్రీన్‌‌ను చూస్తూ ఎక్కువసేపు ఒకే పాయింట్‌ను చూస్తూ ఉంటే, మీ కళ్లు అలసిపోతాయి. ఇది ఒక పాయింట్‌పై దృష్టి పెట్టే మీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

"కంప్యూటర్‌పై పని చేయడం, సినిమా చూడటం లేదా పుస్తకం చదవడం వంటి అత్యంత కేంద్రీకృతమైన సమయాల్లో మనం సాధారణం కంటే తక్కువ రెప్పలు వేస్తాం" అని డన్‌బార్ అంటున్నారు.

మీకు కొంత దృష్టిలోపం ఉన్నప్పటికీ మీరు పని ఎక్కువ చేస్తే మీ కళ్లు అలసిపోతాయి. ఆ రోజు మీకు బ్యాడ్‌గా ముగుస్తుంది. మీ పరిస్థితి ఇదే అయితే వెంటనే కంటి వైద్యులను సంప్రదించడానికి వెనుకాడవద్దు.

4. దృష్టిలో మార్పు

ఒకటి లేదా రెండు కళ్లల్లోని దృష్టిలో వేగవంతమైన మార్పు అంత మంచిది కాదు.

''మీకు సరిగా కనపడకపోతే అద్దాలు మార్చుకుంటే సరిపోతుంది. కానీ ఈ మార్పుపై చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది" అని డన్‌బార్ హెచ్చరిస్తున్నారు.

స్వల్పకాలిక దృష్టి కోల్పోవడం కూడా కంటిశుక్లం లక్షణం కావచ్చు. దీంతో డన్‌బార్ చెప్పిన సమస్యలు, రాత్రిపూట డ్రైవింగ్‌ చేయడంలో ఇబ్బంది, పరిశీలించడంలో ఇబ్బంది వంటి సమస్యలు రావొచ్చు.

" క్యాటరాక్ట్ సర్జరీ చాలా సాధారణ విషయంగా మారింది. ఇది కేవలం 15 నిమిషాల్లో చేస్తున్నారు" అని నిపుణులు అంటున్నారు.

కంటి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన సమస్యలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది.

"పై సంకేతాలతో ప్రజలు తమ దృష్టి సరిగ్గా ఉందో, లేదో నిర్ధరించుకోవాలి, వారి కళ్లను క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి" అని డన్‌బార్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-05-25T08:08:30Z dg43tfdfdgfd