కరకర పేలాలు @ కట్టంగూరు

చేతుల్లో తేలికగా ఇమిడిపోతూ, పంటికిందికి చేరగానే కరకరలాడే మరమరాలు అంటే అందరికీ ఇష్టమే! తిరగమోత వేసుకొని తినడం మొదలుపెడితే కాలం తెలియదు. పేదోడి టిఫిన్‌గా పేరొందిన బొంగుపేలాలకు నల్లగొండ జిల్లా కట్టంగూరు పెట్టని కోటగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 8 దశాబ్దాలుగా ఇక్కడ మరమరాల పరిశ్రమ విలసిల్లుతున్నది. మొదటగా నల్లా వెంకట్రాములు అనే వ్యక్తి కట్టంగూర్‌లో సంప్రదాయ విధానంలో బొంగుపేలాల పరిశ్రమను నెలకొల్పారు.

తర్వాత స్థానికులు ఇండ్లలోనే కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసుకొని బొంగుపేలాలు తయారు చేయడం ప్రారంభించారు. కాలక్రమంలో యాంత్రిక పరిజ్ఞానం తోడవడంతో కట్టంగూరులో సుమారు 35 పరిశ్రమలు వెలిశాయి. వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కట్టంగూరు మరమరాలకు ఉభయ తెలుగు రాష్ర్టాల్లో మంచి పేరుంది. ఇవి తెలుగు రాష్ర్టాలకు మాత్రమే పరిమితం కాలేదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు లారీల కొద్దీ మరమరాలు ఎగుమతి అవుతున్నాయి. యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, శ్రీశైలం, అన్నవరం తదితర పుణ్యక్షేత్రాల్లోనూ కట్టంగూరు మరమరాలు రాశులకొద్దీ అమ్ముడవుతాయి.

సమక్క సారక్క, పెద్దగట్టు, చెరువుగట్టు తదితర జాతర వేళల్లో వీటి విక్రయాలు జోరందుకుంటాయి. చిరువ్యాపారులు కట్టంగూరు నుంచి మరమరాలు తీసుకెళ్లి పట్టణాల్లో, గ్రామాల్లో అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి మరమరాల పరిశ్రమలో మండలంలోని వందలాది మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. కొందరు సొంతంగా పరిశ్రమ స్థాపించి పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేయడం, నాణ్యత బాగుండటంతో కట్టంగూరు బొంగుపేలాలకు మంచి ఆదరణ లభిస్తున్నది.

గంధమల్ల ఎల్లయ్య

2023-03-18T19:25:47Z dg43tfdfdgfd