క‌ళామ త‌ల్లి పై ప్రేమ‌తో..

  • చిన్నగుండవెల్లిలో నృత్యకళా శిక్షణ
  • చిన్నారుల ఆసక్తిని మెచ్చిన ప్రముఖ నృత్యకారిణి
  • వేసవి ప్రత్యేకంగా శిక్షణ శిబిరం ఏర్పాటు
  • పేరిణి శివతాండవం, ఆంధ్రనాట్యం, కూచిపూడి నృత్యాంశాల్లో తర్ఫీదు

నాట్యం నేర్చుకోవాలన్న వారి తపనను చూసి కళామతల్లి కదిలివచ్చింది. నృత్య కళలో ప్రావీణ్యం సాధించాలన్న వారి సంకల్పానికి శిక్షకురాలి ఆశయం తోడయ్యింది. ఓ చిన్న పల్లెటూరిలో ఉంటూ పట్నం వెళ్లి సంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందాలనుకున్న ఆ చిన్నారుల కలను ప్రముఖ నృత్యకారిణి నెరవేర్చుతున్నారు.

సిద్దిపేట రూరల్‌, మే 25: జిల్లా కేంద్రమైన సిద్దిపేట రూరల్‌ మండలంలోని చిన్నగుండవెల్లిలో వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగుతున్నది. గ్రామంలోని హనుమాన్‌ మందిరంలో ప్రతి ఆదివారం సంప్రదాయ నృత్యకళా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన చిన్నారులు సుమారు 20 మంది ఆసక్తి కనబర్చడంతో సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రముఖ నృత్యకారిణి డాక్టర్‌ భవానీ విజయ్‌ శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వేసవి సెలవుల ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ శిబిరంలో శిక్షకురాలు భవాని చిన్నారులకు పేరిణి శివతాండవం, కూచిపూడి నృత్యం, ఆంధ్రనాట్యం అంశాల్లో తర్ఫీదునిస్తున్నారు.

చిన్నారుల ఆసక్తిని మెచ్చి..

చిన్నగుండవెల్లిలోని కొందరు చిన్నారులు నాట్యం నేర్చుకోవాలనుకున్నారు. కానీ, తమ ఊరిలో సంప్రదాయ నృత్య కళలో శిక్షణ ఇచ్చే కళాకారులెవరూ లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. పట్టణంలో శిక్షకులు ఉంటారని తెలిసినా అక్కడి దాకా రోజూ వెళ్లి రావడం ఇబ్బందిగా భావించారు. ఆపై ఫీజులు, రవాణా చార్జీల గురించి ఆలోచించి నిట్టూర్చారు. అయితే, చిన్నగుండవెల్లిలో కొంత మంది చిన్నారులు క్లాసికల్‌ డాన్స్‌ నేర్చుకోవాలనుకుంటున్నారన్న విషయం ఎలాగోలా ఆ గ్రామస్తుల ద్వారా డాక్టర్‌ భవానీ విజయ్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె ఆ గ్రామంలోనే నృత్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గ్రామంలోని హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో డాన్స్‌ క్లాసెస్‌ చెప్తున్నారు. వేసవి సెలవులు ఆరంభమైనప్పటి నుంచి ఈ నృత్య శిక్షణ తరగతులు ఉత్సాహభరితమైన వాతావరణంలో కొనసాగున్నాయి. నిస్వార్థంతో, సేవా దృక్పథంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి గ్రామానికి వచ్చి శిక్షణ ఇస్తున్నందుకు చిన్నారులు కూడా శ్రద్ధతో నేర్చుకుంటుండడం సంతృప్తిగా ఉందని చెబుతున్నారు డాక్టర్‌ భవాని.

పేరిణి నాట్యం నేర్చుకుంటున్నా…

పేరిణి నాట్యం నేర్చుకుంటున్నా. టీచర్‌ ఇక్కడికే వచ్చి పాఠాలు చెబుతున్నారు. నాట్యం చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. గుడిలో ఎంతో భక్తిశ్రద్ధలతో నేర్చుకుంటున్నాం. రోజూ నేర్చుకోవాలంటే పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతీ సండే క్రమం తప్పకుండా క్లాసుకు వస్తున్నా.

– నాయినిక, విద్యార్థిని

కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నా..

నాకు నాట్యం నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్‌ ఉంది. కూచిపూడి, పేరిణి నృత్యం అంటే చాలా ఇష్టం. పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత టైం ఉండదు. ప్రతి సండే ఇక్కడే నేర్చుకోవాలని అనుకున్నా. 20 మంది విద్యార్థులం ఉండడంతో టీచర్‌ ఇక్కడే వచ్చి పాఠాలు చెబుతున్నారు.

– వైష్ణవి, విద్యార్థిని

నిరంతరం సాధన చేయాల్సిన విద్య…

కూచిపూడి, పేరిణి, ఆంధ్రనాట్యం ఒక నెలో, ఏడాదో నేర్చుకునేది కాదు. నిరంతరం సాధన చేస్తేనే పట్టు వస్తుంది. పూర్వీకులు మనకిచ్చిన కళలను మనమే కాపాడుకోవాలి. చిన్నగుండవెల్లిలో 20 మంది చిన్నారులు నేర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నారని తెలిసింది. వీరిని సిద్దిపేట పట్టణానికి రావాలని కోరడం సరికాదని ఇక్కడే శిక్షణ ఇస్తున్నా. చిన్నారులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది.

– డాక్టర్‌ భవానీ విజయ్‌, నృత్య శిక్షకురాలు, సిద్దిపేట

2023-05-25T21:05:38Z dg43tfdfdgfd