ప్రసూతి వణుకు

‘పండంటి ఆడబిడ్డ’ నర్సమ్మ ప్రకటిస్తుంది. భర్త మురిసి పోతాడు. అత్తామామలు సంతోషిస్తారు. పుట్టింటివాళ్లు పండుగ చేసుకుంటారు. కన్నతల్లి ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అంతలోనే.. అనూహ్యమైన మార్పు. ఆ పచ్చి బాలింతరాలి శరీరం చిగురుటాకులా వణికిపోవడం మొదలవుతుంది. సాధారణ ప్రసవమైనా, సిజేరియన్‌ అయినా.. పెద్దగా తేడా ఉండదు. రెండు సందర్భాల్లోనూ ఈ సమస్య ఎదురుకావచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు.

అందులో ముఖ్యమైంది రక్తహీనత. డెలివరీ సమయంలో తల్లి చాలా రక్తాన్ని కోల్పోతుంది. రక్తాన్ని వేగంగా వృద్ధి చేసుకోవడం ద్వారా శరీరమే సగానికి సగం లోటును భర్తీ చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. అయినా, రక్తహీనత వెంటాడుతూనే ఉంటుంది. దీనివల్లే వణుకు రావచ్చు. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు కూడా ఓ కారణమేనంటున్నారు స్త్రీవైద్య నిపుణులు. డెలివరీ సమయంలో తల్లి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల వ్యవస్థ కూడా ఆ ప్రభావానికి లోనవుతుంది.

‘షివరింగ్‌ రియాక్షన్స్‌’కు దారితీసే పరిస్థితులే ఇవన్నీ. థైరాయిడ్‌ సమస్యలు, ఐరన్‌ లోపాన్ని కూడా తేలిగ్గా తీసుకోలేం. దాదాపు 32శాతం బాలింతలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటారని గణాంకాలు చెబుతున్నాయి. డెలివరీ తర్వాత కొద్ది గంటలపాటూ ఉక్కిరిబిక్కిరి చేస్తుందీ సమస్య. ఇది హానికరం కూడా కాదు. రోజుల తరబడి కొనసాగితే మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి. వెచ్చని దుప్పటి సమకూర్చడం, వేడివేడి పానీయాలు ఇవ్వడం, రూమ్‌ హీటర్‌ సాయంతో గదిని వెచ్చగా మార్చడం.. మొదలైన చిట్కాలూ కొంతమేర పనిచేస్తాయి.

2023-05-25T20:05:33Z dg43tfdfdgfd