ప్రిన్స్‌ విలియంతో వివాహానికి ముందు.. కేట్‌కు సంతాన సాఫల్య పరీక్ష.. వెలుగులోకి సంచలన విషయాలు

బ్రిటన్‌ రాజకుటుంబానికి సంబంధించి ఏ విషయమైనా ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో వచ్చిన జాత్యాహంకార ఆరోపణలు మొదలు ఇటీవల ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry), మేఘన్‌ మెర్కెల్‌ (Meghan Markel)లకు ఎదురైన పరాభవాల వంటి ఎన్నో విషయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రిన్స్‌ విలియమ్‌ (Prince William)తో వివాహానికి ముందు యువరాణి కేట్ మిడిల్టన్‌కు (Kate Middleton) సంతాన సాఫల్య పరీక్ష నిర్వహించినట్లు తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది.

కేట్ మిడిల్టన్‌, ప్రిన్స్‌ విలియమ్‌ వివాహం ఏప్రిల్‌ 29, 2011న వెస్ట్‌మినిస్టర్‌ ఆబేలో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహానికి దాదాపు 1900 మంది అతిథులు హాజరుకాగా.. ఆ రోజున దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. అయితే, కేట్‌ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో కొన్ని అసాధారణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో రాణి కాబోయే అమ్మాయికి సంతాన సాఫల్యత ఉందా? అని తెలుసుకునే పరీక్ష ముఖ్యమైంది.

టామ్‌ క్విన్‌ అనే రచయిత ‘గిల్డెడ్‌ యూత్‌: యాన్‌ ఇంటిమేట్‌ హిస్టరీ ఆఫ్‌ గ్రోయింగ్‌ అప్‌ ఇన్‌ ది రాయల్‌ ఫ్యామిలీ’ పేరుతో రాసిన పుస్తకంలో రాజకుటుంబంలో పెళ్లిళ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బ్రిటన్ రాజకుటుంబం పాటించే విభిన్న సంప్రదాయాలను ఈ పుస్తకంలో వివరించారు. భవిష్యత్తులో రాణి కావాల్సిన మహిళకు సంతాన సామర్థ్యం ఉందా? అని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఒకవేళ ఆ పరీక్షలో ప్రతికూల ఫలితం వస్తే వివాహం ఆగిపోతుందనడంలో ఎటుంవంటి సందేహమే లేదని చెప్పారు.

విలియమ్స్ తల్లి ప్రిన్సెస్‌ డయానా కూడా 1981లో ఇటువంటి పరీక్షనే ఎదుర్కొన్నారని పుస్తకంలో పేర్కొన్నారు. ‘రచయిత్రి టామ్ క్విన్‌తో జరిగిన సంక్షిప్త ఇంటర్వ్యూలో డయానా ఈ విషయం వెల్లడించింది.. తొలుత సాధారణ ఆరోగ్య పరీక్షలని భావించారు.. ఆమె నిజంగా సంతాన సాఫల్యత కోసం పరీక్షలు చేసినట్టు తర్వాత మాత్రమే గ్రహించారని తెలిపారు. ‘నేను చాలా అమాయకురాలిని, నేను ఆ దశలో ప్రతిదానిని దాటుకుంటూ వెళ్లాను’ అని డయానా చెప్పారన్నారు. కాగా, విలియమ్, కేట్ దంపతులకు ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ చార్లెట్టే, ప్రిన్స్ లూయిస్ ముగ్గురు సంతానం.

మరోవైపు, ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ పిల్లలను రాజకుటుంబం వారసులుగా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత గురువారం వారికి ప్రిన్స్‌, ప్రిన్సెస్‌ హోదా కల్పించించింది. వీరు రాజకుటుంబ సింహాసనం వారసుల జాబితాలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నారు.

Read More

Latest International News

And

Telugu News

2023-03-16T01:47:21Z dg43tfdfdgfd