ఏ జీవుల్లో అయినా మగ, ఆడ కలిస్తేనే పునరుత్పత్తి సాధ్యమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. జీవులను బట్టి పునరుత్పత్తి విధానాల్లో మార్పులు ఉన్నా.. ఆడ, మగ ప్రమేయం మాత్రం తప్పనిసరి అని ఇప్పటి వరకు భావించాం. కానీ కొత్త పరిశోధనలు ఆశ్చర్యకర ఫలితాలను అందిస్తున్నాయి. మగ, ఆడ జాతుల ప్రమేయం లేకుండానే పిండాలను అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాదు తాజాగా శాస్త్రవేత్తలు రెండు మగ ఎలుకల ద్వారా మరో ఎలుక పిల్లను సృష్టించారు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ పరిశోధన వివరాలు చదివేయండి.
శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం కోసం మగ ఎలుకల తోక వద్ద చర్మ కణాల(Skin Cells)ను తీసుకున్నారు. వాటిని ‘ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్’గా మార్చారు. ఇవి అనేక రకాల కణాలు లేదా కణజాలాలుగా అభివృద్ధి చెందుతాయి. వాటిని అభివృద్ధి చేయడం, మందులు అందించడం వంటి ప్రక్రియ ద్వారా, మగ ఎలుక మూల కణాలను ఆడ ఎలుక కణాలుగా మార్చారు. ఫంక్షనల్ ఎగ్ సెల్స్‌ను ఉత్పత్తి చేశారు. తర్వాత ఆ ఎగ్స్‌ని ఫలదీకరణం చేసి ఆడ ఎలుకల పిండంలోకి ప్రవేశపెట్టారు.
అయితే దాదాపు 630 పిండాల్లో 1 శాతం పిండాల్లో మాత్రమే ఎలుక పిల్లలు పెరిగాయి. అవి చాలా సాధారణంగానే పెరిగాయని, భవిష్యత్తులో మరో ఎలుక పిల్లకు జన్మనిచ్చే సామర్థ్యం కూడా ఉందని క్యుషు యూనివర్సిటీ, జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ లీడర్ కట్సుహికో హయాషి చెప్పారు. ఈ అంశాలను ఆయన గత వారం హ్యూమన్ జీనోమ్ ఎడిటింగ్‌పై జరిగిన మూడో అంతర్జాతీయ సమ్మిట్‌లో వివరించారు.
తాజా పరిశోధనకు సంబంధించిన అధ్యయనం బుధవారం నేచర్ జర్నల్‌లో ప్రచురితం అయింది. ఈ పరిశోధన మూల కణం, పునరుత్పత్తి జీవశాస్త్రం రెండింటిలోనూ కీలక ముందడుగని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ స్టెమ్ సెల్, పునరుత్పత్తి నిపుణులు డయానా లైర్డ్ మాట్లాడుతూ.. ఫలితాలు ఎలా ఉన్నా, ఇది చాలా తెలివైన వ్యూహమని చెప్పారు.
* అది తొందరపాటు..!
లైర్డ్, ఆమె సహోద్యోగి జోనాథన్ బేయర్ మాట్లాడుతూ.. ‘ఈ పరిశోధన జంతువులు, మనుషుల్లో రీప్రొడక్టివ్ బయాలజీ, ఫెర్టిలిటీ రీసెర్చ్‌లో కొత్త మార్గాలను తెరుస్తుంది. కేవలం మగ జీవి నుంచి అంతరించిపోతున్న జాతులను రక్షించుకునే అవకాశం కలుగుతుంది. నైతిక, చట్టపరమైన సమస్యలను తప్పించుకుంటూ, జీవసంబంధమైన పిల్లలను కలిగి ఉండటానికి, మగ స్వలింగ జంటలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది.’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : కంపెనీ బాస్‌గా రోబో.. 6 నెలల్లోనే అద్భుతాలు.. దూసుకపోయిన కంపెనీ షేరు విలువ
* సింథటిక్ పిండాల అభివృద్ది
గత వేసవిలో కాలిఫోర్నియా, ఇజ్రాయెల్‌లోని శాస్త్రవేత్తలు తండ్రి స్పెర్మ్ లేదా తల్లి గుడ్డు లేకుండా మూలకణాల నుంచి "సింథటిక్" ఎలుక పిండాలను సృష్టించారు. ఆ పిండాలు ఫలదీకరణం తర్వాత 8 ½ రోజుల వరకు సాధారణ పిండాలలాగే ఉన్నాయి. గుండె కొట్టుకోవడం వంటి వాటితో సహా అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. భవిష్యత్తులో పరిశోధన కోసం సింథటిక్ మానవ పిండాలను రూపొందించడానికి ఈ అధ్యయనం పునాది వేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
* మనుషుల్లో ఇలాంటి ప్రయోగం సాద్యమేనా?
రెండు మగ ఎలుకల నుంచి ఎలుక పిల్లను తీసుకొచ్చిన టెక్నాలజీని మనుషుల్లో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయా? అనే చర్చలు ఊపందుకున్నాయి. అయితే చాలా తక్కువ ఎలుకల పిండాల నుంచి మాత్రమే ఎలుక పిల్లలు వచ్చాయని, ఎక్కువ శాతం విఫలమయ్యాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని పిండాలలో మాత్రమే ఎలుక పిల్లలు పెరగడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి టెక్నాలజీ లేదా బయాలజీ సమస్యలు కారణాలు అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పుడే ఈ ప్రోటోకాల్ మానవ మూలకణాలలో పని చేస్తుందో లేదో తెలుసుకోవాలనుకోవడం తొందరపాటు అవుతుందని స్పష్టం చేశారు.
2023-03-17T05:40:45Z dg43tfdfdgfd