సేంద్రియ పెరటి తోట

  • ఏడాది పొడవునా కూరగాయల సాగుకు అనుకూలం
  • వృక్ష సంబంధ నూనెలు, కషాయాలతో సస్యరక్షణ
  • నాణ్యమైన దిగుబడులకు అవకాశం

గరిడేపల్లి, మార్చి 14 : ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండించుకోవచ్చు. బయో ఇన్‌టెన్సివ్‌ గార్డెనింగ్‌ విధానంలో పూర్తిగా సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తూ పెరటి తోటలను సాగు చేసే విధానం ద్వారా నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని గడ్డిపల్లి కేవీకే ఉద్యాన వన శాస్త్రవేత్త సీహెచ్‌. నరేశ్‌ తెలిపారు. పెరటి తోటల పెంపకంపై ఆయన పలు విషయాలు వివరించారు.

మడి తయారీ

పెరటి తోట కోసం ముందుగా మడిని తయారు చేసుకోవాలి. 100 చదరపు మీటర్ల స్థలంలో 20 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉండేలా దీర్ఘ చతురస్ర్తాకారంలో మడిని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో 2అడుగుల లోతు వరకు రాళ్లు లేకుండా చేయాలి. దీనిలో 6 తట్టల బాగా మాగిన పశువుల ఎరువు, 4 కిలోల వర్మికంపోస్ట్‌, 4కిలోల వేప పిండి, 2 కిలోల కోడి గుడ్లు లేదా నత్తగుల్లలు, పావు కిలో కొయ్యబూడిద, 2 కిలోల సుబాబుల్‌ రొట్ట, 2 కిలోల వేప రొట్ట వేసి కలుపుకోవాలి. ఈ పదార్థాలు మొక్కలకు పోషక పదార్థాలను అందించడంతో పాటు భూమిని గుల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కాలాలకు అనుగుణంగా ఎంపిక

పెరటి తోటలో పెంచుకునే ఐదు రకాలు కూరగాయలను ఆయా కాలాలకు అనువైన రకాలను మాత్రమే ఎంచుకోవాలి. లేకపోతే వాటి పెరుగుదల సరిగా ఉండక చీడ, పీడల బారిన పడి సరైన దిగుబడి రాక నష్టపోయే అవకాశం ఉంది.

సేంద్రియ కూరగాయలతో ఆరోగ్యం

ఐదు రకాల కూరగాయాలను పండించి వాటిని మనం నిత్యం తినడం వల్ల శరీర పెరుగుదలకు అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, పిండి, కొవ్వు, పీచు పదార్థాలు, నీరు అందుతాయి. దాంతో మన శరీరం సమీకృత పోషక పదార్థాలను పొందేందుకు దోహదపడతాయి.

పంటమార్పిడి

ఒక మడిలో ఒక రకమైన కూరలు పండించిన తర్వాత తిరిగి అదే మడిలో రెండోసారి అదే రకమైనవి పండించకూడదు. ఆకుజాతి పంటను తీసివేసిన మడిలో మరోసారి ఆకుజాతిని కాకుండా ఇతర జాతులను నాటుకోవాలి. ఇలా అన్ని పంటలను మార్పిడి చేసుకోవాలి. ఈ పద్ధతి అవలంబిచడం వల్ల రెండోసారి పండించే మొక్కలకు పోషక పదార్థాలు సమృద్ధిగా అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. తీగజాతి కూరగాయలను కూడా మడి ఉత్తర, దక్షిణ దిశలలోనే మార్చి పెట్టుకోవాలి. రెండో సారి నాటుకునే ముందు సేంద్రియ ఎరువులు, రొట్టలలో నాలుగో వంతు తీసుకొని భూమిలో కలుపాలి. మొక్కల చుట్టూ బంతి లేదా తులసి మొక్కలను నాటుకుంటే మొక్కలకు పురుగులు ఆశించకుండా చూసుకోవచ్చు.

సస్యరక్షణ

మొక్కలను ఆశించే పురుగులు, తెగుళ్లను అరికట్టేందుకు వృక్ష సంబంధ నూనెలు, కషాయాలు, బూడిద వంటి వాటిని తగిన రీతిలో ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

వృక్ష సంబంధ నూనెలు

వేపనూనె, కానుగనూనె, జట్రోపా గింజల నూనె, పొగాకు కాడల కషాయం, బంతికాడల కషాయం, కొయ్య బూడిద, దశ పత్ర కషాయం, జీవామృతం, వేస్ట్‌ డీకంపోజర్‌ మొదలయిన వాటిని తగిన పరిమాణంలో నీటిలో కలిపి మొక్కలపై చల్లుకోవాలి. బూడిదను ఉదయం వేళల్లో ఆకులకు అంటుకునే విధంగా పల్చని గుడ్డలో కట్టుకొని చల్లుకోవాలి. వేప, కానుగ నూనెలను చల్లేటప్పుడు నీటిలో కుంకుడకాయల రసం తీసుకొని వంద గ్రాముల రసంలో మూడు మిల్లీలీటర్ల నూనెను బాగా కలిపి, తర్వాత 900 మి.లీ నీటిని తిప్పుతూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆకుల అడుగున, పైన తడిసే విధంగా చల్లుకోవాలి. పావుకిలో ఎండిన బంతి లేదా పొగాకు కాడలను రెండు లీటర్ల నీటిలో బాగా మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. దీనిని వడగట్టి 100మి.లీల ద్రావణాన్ని 900మి.లీల నీటిలో కలిపి మొక్కలపై చల్లుకోవాలి.

20 రోజులకు ఒకసారి

పెరుగుతున్న మొక్కలపై ప్రతి 20 రోజులకు ఒకసారి కషాయం లేదా నూనె ద్రావణాన్ని మార్చి, మార్చి చల్లుతూ ఉండాలి. ఇవి క్రిమి, కీటకాలను నివారించడంలో తోడ్పడతాయి. వృక్షసంబంధమైన పదార్థ్దాలను వినియోగించడం వల్ల వాతావరణ, నీటి కాలుష్యం ఏర్పడదు. కూరగాయల మీద అవశేషాలు కూడా ఉండవు. దాంతో ఆరోగ్య కరమైన కూరగాయలను పొందవచ్చు.కూరగాయల పెంపకం

మడిని నాలుగు సమభాగాలుగా తయారు చేసుకోవాలి. ఒక్కో భాగం 25 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటాయి. మొదటి మడిలో ఆకుకూరలు, రెండో మడిలో దుంపజాతి(ముల్లంగి, కేరట్‌ వంటివి), మూడో మడిలో కాయజాతి(వంగ, బెండ, టమాటా వంటివి), నాలుగో మడిలో చిక్కుడు జాతి మొక్కలను నాటుకోవాలి. మడికి ఉత్తరం లేదా దక్షిణ దిశలో తీగజాతి విత్తనాలు రెండు కుదుళ్లలో నాటుకొని అదే దిశలో పందిరి వేసుకోవాలి. పందిరిని తూర్పు, పడమర దిశలలో వేస్తే కింది మడిలో పెరుగుతున్న మొక్కలకు ఉదయం, సాయంత్ర వేళలో ఎండ అందక చీడ, పీడలకు గురి అవుతాయి.

2023-03-14T20:33:27Z dg43tfdfdgfd