సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : సీతాకోక చిలుక అందమైన రెక్కలున్న ఒక కీటకం..అవి మనల్ని ఎంతగానో ఆకర్శిస్తాయి. చిన్నప్పుడు దానిని పట్టుకోవడానికి దాని వెంట ఎన్నిసార్లు పరిగెత్తామో..ఈ అనుభవం చాలా మందికి ఎదురయ్యే ఉం టుంది. కాంక్రీట్ జంగీల్గా మారిన నగరంలో సీతాకోకచిలుకలు కనబడడమే తక్కువైపోయాయి. వాటికి కనీసం ఆహారం లేకుండా మొక్కలను, చెట్లను నరికేస్తున్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా కేపీహెచ్‌బీ కాలనీలో సీతాకోక చిలుకల పార్కును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్నది. జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్శిటీ ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున పార్కుల అభివృద్ధిని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోగ్యమే పరమావధిగా వైవిధ్యమైన థీమ్ పార్కుల ఏర్పాటు చేస్తున్నది. రూ. 123 కోట్లతో 12,89,337 చదరపు గజాల్లో వినూత్న అంశాలతో 57 థీమ్ పార్క్‌లకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్ రోడ్డులో రూ.10.81 లక్షలతో అభివృద్ధి చేసిన సీతాకోక చిలుకలు (బటర్‌ైప్లె) థీమ్ పార్కును త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి. మమత తెలిపారు.
కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్ రోడ్డులో రూ.10.81 లక్షలతో సీతాకోక చిలుకలు (బటర్‌ైప్లె) థీమ్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. 560 స్కేర్ మీటర్ల స్థలంలో ఓ వైపు ప్రహరీని నిర్మించి ఆ గోడకు రంగురంగుల సీతాకోక చిలుకల పెయింటింగ్‌లను వేశారు. మరోవైపు సీతాకోక చిలుకలను ఆకర్షించే మొక్కలను నాటారు. ఇగ్జోరా, లావెండర్, చైనాబాక్స్, వింకారోజియా, లాంటేనా కెమెరా (పులికంప), టెకిమా కెపిన్సిస్, కదంబ, పైసోవియా ఆల్బా, గోవర్ధనగిరి, పైకాస్మాల్టిహెడ్ లాంటి విభిన్న రకాల మొక్కలను నాటారు. ఈ మొక్కలకు అన్ని కాలాలలో సీతాకోక చిలుకలను ఆకర్షించే గుణం ఉటుంది. ఈ మొక్కల పరిరక్షణ కోసం పార్కు చుట్టూరా కంచెను ఏర్పాటు చేశారు. ఈ థీమ్ పార్కులో సీతాకోక చిలుకల మాదిరిగా ఉండే ఆరు బెంచీలను అందుబాటులోకి తేనున్నారు. ఈ పార్కు ఎదుట సీతాకోక చిలుక సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీతాకోక చిలుకల వృద్ధి, ప్రజలకు ఆహ్లాదం కోసమే ఈ పార్కు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
2023-03-27T22:05:21Z dg43tfdfdgfd