ఆడపిల్లలను సాదలేక అమ్ముకున్నడు

ఆడపిల్లలను సాదలేక అమ్ముకున్నడు 

  • ఆడపిల్లలను సాదలేక అమ్ముకున్నడు 
  • రూ.5.40 లక్షలకు కవలలను విక్రయించిన తండ్రి 
  • తండ్రికి రూ.2.40 లక్షలు, మిగతావి దళారులకు.. 
  • ఆదిలాబాద్​లో 9 మంది అరెస్టు

ఆదిలాబాద్, వెలుగు : ఆడపిల్లలను సాదలేక ఓ తండ్రి అమ్ముకున్నాడు. దళారుల సాయంతో కవల పిల్లలను కర్నాటకలో విక్రయించాడు. ఆరు నెలల కింద ఆదిలాబాద్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆడపిల్లలను రక్షించి, నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆదిలాబాద్ మండలంలోని బంగారుగూడకు చెందిన గంగాధర్ నిరుపేద. ఆయనకు మొత్తం ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. భార్య రాధ 11 నెలల కింద ఇద్దరు కవలలకు జన్మనిచ్చి చనిపోయింది. గంగాధర్ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ జగన్నాథ్... తన స్నేహితుడు షారూఖ్ సాయంతో ఆయనను సంప్రదించాడు. ‘‘తల్లి లేకుండా కవల పిల్లలను పెంచడం కష్టం. నాకు తెలిసినోళ్లకు పిల్లలు లేరు. వాళ్లకు నీ పిల్లలను ఇస్తే డబ్బులు ఇప్పిస్తాను” అని చెప్పి గంగాధర్​ను ఒప్పించాడు. ఆడపిల్లల పోషణ భారం కావడం, ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో కవలలను అమ్మాలని గంగాధర్ నిర్ణయించుకున్నాడు. 

ఆర్ఎంపీ అక్కదే కీ రోల్.. 

ఆర్ఎంపీ డాక్టర్ జగన్నాథ్ అక్క శీతల్ రమ, ఆమె భర్త అశోక్ కర్నాటకలో ఉంటున్నారు. ఎక్కడైనా పిల్లలు ఉంటే చెప్పాలని, అందుకు డబ్బులు ఇస్తామని ఏడాది కింద జగన్నాథ్​కు చెప్పారు. గంగాధర్ తన బిడ్డలను అమ్మేందుకు ఒప్పుకోవడంతో జగన్నాథ్ ఆ విషయాన్ని తన అక్క రమ, ఆమె కూతురు కోమలకు తెలిపాడు. ఇద్దరు బిడ్డలను ఇస్తే గంగాధర్​కు రూ.2.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. 6 నెలల కింద గంగాధర్ తన తమ్ముడు అశోక్, అక్క గంగమ్మ, అత్త గంగమ్మతో కలిసి కారులో కర్నాటక వెళ్లాడు. అక్కడ కార్వ జిల్లా కుంట గ్రామానికి చెందిన గజానంద్ బాల అనే వ్యక్తి నుంచి రమ, కోమల్ రూ.2.40 లక్షలు తీసుకొని కవలల్లో ఒక బిడ్డను అప్పగించారు. అదే గ్రామ శివారుకు చేరుకొని రాజ్ కుమార్ అనే వ్యక్తికి రూ.3 లక్షలకు మరో బిడ్డను అప్పగించారు. మొత్తం రూ.5.40 లక్షలు రాగా.. అందులో గంగాధర్​కు రూ.2.50 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బుల్లో రమ రూ.1.40 లక్షలు, ఆర్ఎంపీ జగన్నాథ్ రూ.లక్ష, షారూక్ రూ.20 వేలు తీసుకొని.. గంగాధర్ తమ్ముడు అశోక్ కు రూ.20 వేలు, గంగాధర్ అక్క, అత్తమ్మలకు రూ.5 వేల చొప్పున ఇచ్చారు.

20 రోజుల కింద  పోలీసులకు ఫిర్యాదు.. 

గంగాధర్​ ఇంట్లో కవల పిల్లలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు.. 20 రోజుల కింద చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వాళ్లు గ్రామానికి వచ్చి విచారించగా పిల్లలు లేరని తేలింది. దీంతో స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో రూరల్ ఎస్సై నాగ్​నాథ్ ఆధ్వర్యంలో ఓ టీమ్ కర్నాటకకు వెళ్లగా, పిల్లలను విక్రయించిన విషయం తెలిసింది. అక్కడున్న కవలలను రక్షించిన పోలీసులు.. పిల్లల తండ్రి గంగాధర్ సహా నిందితులు శీతల్ రమ, జగన్నాథ్, షారూఖ్, అశోక్, కర్నాటకకు చెందిన గజానన్ బాల, ఆయన భార్య మమత, రాజ్ కుమార్, ఆయన భార్య సుజాతను అరెస్టు చేశారు. కవలలను శిశుగృహానికి తరలించారు.  కాగా, ఆడ పిల్లలను అమ్మగా వచ్చిన డబ్బులతో గంగాధర్ టాటా ఏస్​ వాహనం కొనుగోలు చేశాడని.. దాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.   

©️ VIL Media Pvt Ltd.

2023-06-01T01:46:17Z dg43tfdfdgfd