కాల్వల నిర్మాణం పూర్తి చేయమంటే నగర్ మేయర్ బెదిరింపులు!

సంతోష్ కుమార్, న్యూస్ 18, వరంగల్

ఓరుగల్లు అంటేనే ఎన్నో పురాతనమైన దేవాలయాలు, కాకతీయుల కట్టడాల కళావైభవానికి పెట్టింది పేరు. హైదరాబాద్ తర్వాత అంతే పెద్ద నగరం వరంగల్ నగరం. అయితే చెప్పుకోవడానికి మహానగరం కానీ ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్యలు, రోడ్ల సమస్యలతో వరంగల్ నగరం సతమతమవుతోంది. నగరంలోని ఎన్నో డివిజన్లలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. అసంపూర్తి పనులతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.

చేసిన పనికి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపివేస్తున్నారు. ఆపడానికి కారణాలేంటని అడిగే వారు లేరు. బల్దియా పాలకవర్గం పెద్దలు, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు పట్టింపు లేనట్లుగా ఉంటున్నారు. వచ్చేది వర్షాకాలం వరద నీటి కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వరంగల్ అబ్బని కుంట మిల్స్ కాలనీ, చింతల్ ప్రాంతాలు ప్రతి సంవత్సరం ముంపుకు గురవుతున్నాయి. 2019 జూలైలో 60 లక్షలతో వరదనీటి కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇప్పటికి సుమారు 30 నెలలవుతున్న పనులు పూర్తికాలేదు. అబ్బని కుంట, చింతల్ వద్ద వరదనీటి కాలువ పనులు ప్రాథమిక దశలోనే ఆపేశారు. దీంతో మురుగు ముందుకెళ్లడం లేదు.. వ్యర్ధాలు పేరుకుపోయి దుర్వాసన వస్తుంది.

దీనిపై స్థానికులు పలుమార్లు విన్నవించినా ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు. వరంగల్ ప్రధమ పౌరురాలు నగర మేయర్ గుండు సుధారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్లో అభివృద్ధి పనులకు బ్రేకులు పడ్డాయి. సుమారు 69.50 లక్షలతో ప్రతిపాదించిన రామన్నపేట పెద్ద మోరీ పనులు సగం పనులు చేసి కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. దీంతో వ్యర్ధాలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ ఇళ్లలోకి వెళ్లేందుకు తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేసుకున్నారు.

ఈ విషయంపై స్థానిక ప్రజలు నగర మేయర్ గుండు సుధారాణి సగంలో ఆపేసిన పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని అడగగా.. నీకు ప్రశ్నించే అధికారం లేదంటూ బదులిచ్చారు. మరికొంతమందిని మీరు ఉండేది కిరాయిల్లే కదా మీకేంటంటూ సమాధానం ఇచ్చారు. అక్కడ ఉండే స్థానికులు సొంతింటివాళ్ళు అడిగితే మీకెందుకు పనులు చేయాలని తిరిగి ప్రశ్నిస్తున్నారట.

ఓట్లు వేసి గెలిపిస్తే ఇలా చేయడం సరికాదని ప్రశ్నించిన వారిని.. నాకేమైనా ఓట్లు ఊరికే వేశారా.. ఓటుకు రూ.1500 రూపాయలు తీసుకొనే కదా వేశారని బుకాయిస్తున్నారట. మరీ గట్టిగా అడిగితే మీ ఇళ్లను అధికారులకు చెప్పి కొలతలు వేసి ఆక్రమించారని కూల్చివేయిస్తానని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారట. గెలిపించుకున్న స్థానిక మహిళ ఇలా మాట్లాడితే తమకు ఇంక దిక్కెవరు అంటూ స్థానికులు వాపోతున్నారు.

2023-03-28T00:16:58Z dg43tfdfdgfd