K Pawan Kumar, News18, Vijayawada
మనకు మంచి పోషకాలిచ్చే పండ్లలో పనస పండు (Jack Fruir) ఒకటి. భారీ పరిమాణంతో ఉండే పండు చూడ్డానికి వింతగా కనిపించినా అందులోని పనస తొనలు నోరూరిస్తాయి. ఈ తొనలు కేవలం రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే పనసపండును ఆయుర్వేదంలో ఔషధ గని అని పిలుస్తారు. ఈ పనస రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతో ఉపయోగ పడుతుంది. పనస పండుని తినడం వలన బాక్టీరియాను కూడా తొలగిస్తుంది. అలాగే ఈజాక్ ఫ్రూట్ విత్తనాలు తినడం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఆ విత్తనాలకి ఉప్పు, మిరియాల కలిపి ఉడికించిన లేదా వేయించిన వాటిలో ఎలా చేసిన సరే రుచికరమైన ఆహారం తయారు చేసుకోవచ్చు. ఈ పనసలో జింక్, విటమిన్లు, ఫైబర్ వంటి ఖనిజాలతో సమృద్దిగా ఉండే ఇవి ఆహారంలో ఉండేలా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పనస పంటలో రకాలు కూడా ఉంటాయి. కర్పూరం, ఖర్జురం రెండు రకాలు ఉంటాయి. కర్పూరం జాతికి చెందిన పనస పండుని పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. ఖర్జుర రకపు పనసకాయ తినడానికి తియ్యగా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కానీ పనస పండులో ఎన్ని రకాలు కలిగి ఉన్న కూడా రెండు రకాలుగానే విభజించారు. పనస పంట ఎలాంటి నేలలో అయినా పండిచుకోవచ్చునని విజయవాడలోని నున్న ప్రాంతంలో రైతు వీరబాబు తెలుపుతున్నారు. తాను గత 30 ఏళ్లుగా ఈ పంటను సాగు చేస్తున్నట్లు న్యూస్ 18 ప్రతినిధితో చెప్పారు.
ఈ పనసను సాగు చేసేందుకు.. ఎకరాకు 15 మెుక్కలు నాటుకోవాలని వీరబాబు తెలిపారు. అయితే కలుపు లేకుండా పొలంలో నీరు నిలిచిపోకుండా ఉండేలాగా మట్టిని సిద్ధం చేసుకోవాలి. కాస్త లోతుగా ఉండే విధంగా గుంతలను తవ్వుకోవాలి. గుంతల మధ్య 6 మీటర్ల దూరం నాటాలని చెబుతున్నారు రైతు. నాటిన దగ్గర నుండి 2 నుండి 3 సంవత్సరాల వరకు క్రమం తప్పకుండా నీరు అందిస్తుండాలి. సంవత్సరానికి రెండుసార్లు చొప్పున ఎరువులు వేస్తుండాలని తెలిపారు.
పనస పండు పూత లేదా, కాయ వస్తున్న దశలో తెగుళ్ళు వస్తుంటాయి. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని మందులు పిచికారీ చెయ్యాలి. నాటిన నాలుగు సంవత్సరాల నుండి కాయ వస్తుంది. పనస పండు పంటలో ప్రతి కాయ 10 నుండి 30 కిలోలు వరకు బరువు ఉంటుంది. ఒక్కో చెట్టుకు 25 కాయలు నుండి 100 కాయలు వరకు వస్తాయని రైతు తెలుపుతున్నారు. ఈ లెక్కన లాభాలు కూడా ఆశాజనకంగా ఉంటాయంటున్నారు.
2023-03-27T10:46:27Z dg43tfdfdgfd