CASHEW: టీ దోమ కాటు.. జీడిపప్పుకు తెగుళ్లతో కలవరం! రైతులకు భారంగా తెల్లబంగారం..

శ్రీకాకుళం జిల్లా పలాస జీడి పప్పు సాగుకు పెట్టింది పేరు. దాని టేస్టే సపరేటూ.. అసలు పలాస అంటేనే అందరికి గుర్తోచ్చేది తెల్ల బంగారం. ఉద్దానం అంటే ఉద్యానవనం. అక్కడే పండే ఉద్దానం జీడి పప్పు చాలా ఫేమస్. ఉద్దానం ప్రాంతంలో పండే జీడి పప్పుకు దేశంలోనే అత్యంత రుచి కలిగిందిగా ప్రజలు చెప్పుకుంటారు. జీడిపప్పు ఎంత రుచిగా ఉంటుందో.. వాటి ధర కూడా అంతే ఉంటుంది. అయితే రైతులకు మాత్రం రోజురోజుకు ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. మూడేళ్లుగా జీడికి తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండడంతో దిగుబడిపై పెను ప్రభావం పడుతోంది. గతంలో అధిక దిగుబడి ఉన్న ఎకరాకు క్వింటా కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో పంట గిట్టుబాటు లేదని రైతు వాపోతున్నారు.

సిక్కొలు జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా పండే పంట జీడే. జిల్లాలోని 30 మండలాల్లో 44 వేల హెక్టారుల్లో జీడి సాగవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 1,87,500 మంది రైతులు సాగుచేస్తున్నట్టు ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా మెళియాపుట్టి కొత్తూరు, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, పాతపట్నం, కంచిలి, ఇచ్ఛాపురం, టెక్కలి, నందిగాం మండలాల్లో సాగు అధికం. అయితే జిల్లా వ్యాప్తంగా 200 వరకూ చిన్న, పెద్దా జీడి పరిశ్రమలున్నాయి. కానీ అవి ఉద్దానానికే పరిమితమయ్యాయి. అయితే ఐటీడీఏ పరిధిలో 8 జీడి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేశారు. కానీ నిర్వహణ లేక మూసివేశారు.

చంపేస్తోన్న టీ దోమ:

మూడేళ్లుగా జీడి పంటకు ‘టీ దోమ’ రూపంలో అపార నష్టం జరుగుతోంది. సాధారణంగా ఎకరాకు 5 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. టీదోమ పుణ్యమా అని ఒకటి ఆరా బస్తా మాత్రమే దిగుబడి వస్తున్నట్టు గిరిజనులు చెబుతున్నారు. ప్రధానంగా నీటి తడి లేకపోవడం వల్లే తెగుళ్లకు అవకాశం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది ముందుగానే గిరిజనులు, రైతులు సస్యరక్షణ చేపట్టాల్సి వస్తోంది. పంట ప్రారంభంలోనే రైతులకు సస్యరక్షణ రూపంలో అదనపు భారం తప్పడం లేదు. రైతుభరోసా కేంద్రాల ద్వారా సాగుకు అవసరమైన అన్నిరకాల యంత్రాలు, ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు అందుబాటులోకి తెచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కనీసం జీడి పంట విషయంలో రైతులకు అవసరమైన సలహాలు, సస్యరక్షణకు అవసరమైన రసాయనాలు అందించాలని రైతులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న విమర్శలున్నాయి. దీంతో రైతులకు సస్యరక్షణకే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

ఆదుకోండి ప్లీజ్:

ఏటా తుపాన్లు, ఈదురుగాలులు లాంటి విపత్తులకు జీడి చెట్లు నేలకొరుగుతున్నాయి. కొన్నేళ్లుగా మృత్యువాత పడుతూ వస్తున్నాయి. ఎండిపోయిన చెట్లు తొలగించి కొత్త మొక్కలు నాటడం గిరిజనులకు తలకుమించిన భారంగా మారింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు మొక్కలు పంపిణీ లాంటి వాటిని ప్రోత్సహించేవారని.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి బ్రేక్‌ పడిందని కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు. మొక్కలు పంపిణీకి నోచుకోక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

2023-03-17T07:55:36Z dg43tfdfdgfd