HYDERABAD | 24 గంటలు భోజనం, చదువుకునేందుకు బుక్స్‌.. హైదరాబాద్‌లో నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్న డాక్టర్‌ దంపతులు

Hyderabad | ఆర్కేపురం, మార్చి 12 : మనదేశంలో నేడు పట్టెడన్నం దొరకక నిత్యం వందలాదిమంది అలమటిస్తున్నారు. ఆలాంటి వారిని చూసి చలించిన వైద్య దంపతులు తమ వంతు సహకారంగా ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నగరంలోని సరూర్‌నగర్‌ డివిజన్‌ ఎస్‌బీఐ కాలనీలో నివాసముండే డా.వింజమూరి సూర్యప్రకాశ్‌, కామిని దంపతులు. వైద్య వృత్తి అంటే కావాల్సినంత సంపాదించుకోవచ్చనే భావన ఉన్న ఈ రోజుల్లో తాము తిని.. మరికొంత మంది ఆకలి తీర్చడంలోనే ఎంతో సంతృప్తి ఉందంటూ 15 సంవత్సరాలుగా ఓపెన్‌ హౌజ్‌ పేరుతో ఆకలితో వచ్చిన వారికి ఆహారం, విడిది సౌకర్యం కల్పిస్తున్నారు. 24గంటలూ సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. పరబ్రహ్మ స్వరూపమో కాదోగానీ ప్రాణాలను మాత్రం కాపాడుతుంది. హైదరాబాద్‌ నగరంలో ఆకలితో ఉండేవారికి తమ వంతు సహకారం అందించాలన్న ధ్యేయంతో ఓపెన్‌ హౌజ్‌ను ఏర్పాటు చేశారు ఆ వైద్య దంపతులు. ఆకలితో అలమటించేవారిని కళ్లారా చూసి చలించిపోయారు. అలాంటి వారి కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఓపెన్‌ హౌజ్‌ ప్రారంభించి ప్రారంభించి ఆకలి బాధలు తీరుస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

Open House

24గంటలు అందుబాటులో..

ఎస్‌బీఐ కాలనీలో 340 గజాల విస్తీర్ణంలో 2006 సంవత్సరంలో ఇళ్లు నిర్మించారు. రెండు అంతస్తులున్న ఆ ఇంట్లో నలుగురు వలంటీర్లను ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి నగరానికి వచ్చి రాత్రి పూట వెళ్లలేని వారు. ఉద్యోగం కోసం వచ్చి వసతిలేని నిరుద్యోగులు, చదువుకునేందుకు వచ్చి ఇబ్బందులు పడే విద్యార్థులు, దిక్కులేక తిండి దొరకని అన్నార్తులు ఎవరైనా సరే, ఏ పని మీద వచ్చినా సరే అవసరం లేదు. ఆకలి తీర్చడమే ఏకైక లక్ష్యం. ఇక్కడ ఏ సమయమైనా సరే వచ్చి వండుకుని తిని సేదతీర వచ్చు. తమతోపాటే సేవ చేయాలనుకునే మరి కొందరి సహకారంతో ఈ ఓపెన్‌ హౌజ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వంట చేసుకోవడానికి కావాల్సిన బియ్యం, కూరగాయలు, గ్యాస్‌ స్టవ్‌ తదితరాలు అందుబాటులో ఉంచుతారు.

నిత్యం 50 మందికి వసతి..

ఓపెన్‌ హౌజ్‌లో భోజనం చేస్తున్న దృశ్యం

ఆకలి తీర్చే కల్పతరువుగా ఉన్న ఈ ఓపెన్‌ హౌజ్‌కు ప్రతి నిత్యం 30నుంచి 60మంది వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఈ హౌజ్‌ నిర్వహణకు ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదంటున్నారు నిర్వాహకులు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత సేవ చేసే ఎంతో చేసినట్లుగా ప్రచారం చేసుకుంటాయని, తాము ప్రచారం కోసం చేయడం లేదంటున్నారు నిర్వాహకులు.

ఓపెన్‌ హౌజ్‌లో వంట చేసుకుంటున్న విద్యార్థులు

విద్యార్థులు, నిరుద్యోగులకు వరం..

ఈ ఓపెన్‌హౌజ్‌(అందరి ఇల్లు) విద్యార్థులు, నిరుద్యోగ యువతకు వరంగా మారింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా ఉంటుంది. పచ్చని చెట్ల మధ్యన ఏర్పాటు చేసిన మంచ, గ్రంథాలయం, ప్రశాంత వాతావరణం దీని సొంతం. వేల రూపాయలు ఖర్చు చేసినా ప్రైవేటు హాస్టళ్లలో ఇలాంటి వసతిని పొందలేమని పలువురు పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిచెన్‌లో సులువుగా వంట చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.

డా. సూర్యప్రకాశ్‌, ఓపెన్‌ హౌజ్‌ నిర్వాహకుడు

ఆకలితో అలమటించవద్దు..

సమాజంలో ఎవరూ కుడా ఆకలితో అలమట్టించవద్దు. తోటి వారి ఆకలిని చూసి చలించిపోయి ఉన్నదాంట్లో ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో 2006లో ఓపెన్‌ హౌజ్‌ను(మన ఇల్లు) స్థాపించా. తమతో చేతులు కలిపి స్నేహితులు సహాయం ఇస్తామంటేనే తీసుకుంటున్నాం. పై అంతస్తుల్లో పగటి వేళ క్లినిక్‌ కొనసాగిస్తూ ఓపెన్‌ హౌజ్‌ నిర్వాహణ కొనసాగిస్తున్నాం. దీనిని చాలామంది స్ఫూర్తిగా తీసుకొని చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేది మా కోరిక.

– డా. సూర్యప్రకాశ్‌, ఓపెన్‌ హౌజ్‌ నిర్వాహకుడు

ఓపెన్‌హౌజ్‌ మాకు వరంలాంటిది

మాది నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రస్తుతం నేనే గ్రూప్స్‌ రాయడానికి సిద్ధమవుతున్నా. గత సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఉదయం 8గంటలకు వచ్చి రాత్రి 8గంటలవయక చదువుకుంటూ మూడు పూటలా అన్నం ఓపెన్‌హౌజ్‌లో వండుకొని తింటున్నా. ఓపెన్‌ హౌజ్‌ గురించి స్నేహితుల ద్వారా తెలుసుకొని ఇక్కడకు వచ్చా. మాలాంటి పేద విద్యార్థులకు అందరిల్లు వరంలా మారింది.

– నరేశ్‌, నిరుద్యోగి

ప్రశాంతతకు నిలయం

మాది సూర్యాపేట జిల్లా ఓపెన్‌ హౌజ్‌లో ఉంటూ ప్రస్తుతం ఎస్‌ఐకి ప్రిపేర్‌అవుతున్నా. ఇక్కడికి వచ్చిన వారిని ఎందు వచ్చారు, ఏ పనిమీద వచ్చారు అని ఎవరు అడుగరు. ఎవరు వచ్చినా వంట చేసుకొని తినాలి. తిన్న తర్వాత వంట పాత్రలను శుభ్రంగా కడిగి ఇవ్వాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి.

– అవినాశ్‌, నిరుద్యోగి

2023-03-15T22:29:09Z dg43tfdfdgfd