RAGI: పాలకు ప్రత్యామ్నాయంగా రాగులు తీసుకోవచ్చా? ఈ సూపర్ ఫుడ్ బెనిఫిట్స్ ఏంటి..?

Ragi: శరీరానికి కాల్షియం ఎంతో ముఖ్యం. ఎముకలు బలంగా ఉండటానికి, వృద్ధి చెందడానికి కాల్షియం అవసరం. అందుకే ఈ పోషకం ఎక్కువగా లభించే పాలు, పాల పదార్థాలు తప్పక తీసుకోవాలి. పాలల్లో కేవలం కాల్షియమే కాకుండా శరీరానికి కావాల్సిన సమతుల్య పోషకాలు ఉంటాయి. కానీ కొందరికి పాలంటేనే నచ్చదు. ఆ వాసన చూస్తేనే ఆమడ దూరంలో ఉంటారు. దీంతో ఇలాంటి వారికి కాల్షియం లోపం ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే పాలకు ప్రత్యామ్నాయంగా కాల్షియం కలిగిన ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిలో ప్రముఖంగా వినిపించే పేరు రాగులు(Ragi). పాలను ఈ రాగులు భర్తీ చేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

రాగులు తృణ ధాన్యాలు. వీటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్, మెగ్నిషీయం వంటివి కూడా ఇందులో ఉంటాయి. పోషకాల పరంగా చూస్తే రాగులు ఎంతో ముఖ్యమైన ఆహార పదార్థం. ముఖ్యంగా శాకాహారుల డైట్‌లో ఇదెంతో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 100 మిల్లీ లీటర్ల పాలలో 118మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. అదే 100 గ్రాముల రాగులతో ఏకంగా 364 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. అంటే దాదాపు రెట్టింపు అన్నమాట. కాబట్టి, పాలకు సరైన ప్రత్యామ్నాయం రాగులేనని నిపుణులు చెబుతున్నారు.

రాగులు ఏం చేస్తాయంటే..?

శరీరంలో కాల్షియం లోపాన్ని రాగులు తగ్గించగలవు. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను నియంత్రిస్తాయి. రక్త పీడనాన్ని కంట్రోల్‌లో ఉంచడంతో పాటు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ని కరిగిస్తాయి. ఫలితంగా గుండె నాళ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. ఇలా రకాలుగా ఉపయోగపడుతూ రాగులు సూపర్ ఫుడ్‌గా నిలుస్తున్నాయి.

Peacock Feathers: ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకుంటే బోలెడు ప్రయోజనాలు.. జ్యోతిష్యుల సూచనలు

* ఎలాగైనా తీసుకోవచ్చు

రాగులను వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకోవచ్చు. రాగి పిండితో జావ చేసుకోవచ్చు. ఇడ్లీలు పెట్టుకోవచ్చు. దోశలు వేసుకోవచ్చు. ఉప్మా వండుకుని తినొచ్చు. ఇందులో గ్లూటెన్ ఉండదు. దీంతో ఎవరైనా రాగులను తీసుకోవచ్చు. అయితే అన్ని సార్లు రాగులు ఒక్కటే పాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని చెప్పలేమని పోషకాహార నిపుణులు అంటున్నారు. కేవలం రాగులనే తీసుకుంటే శరీరానికి సమతుల్యత చేకూరక పోవచ్చని చెబుతున్నారు. రాగులతో పాటు డ్రై ఫ్రూట్స్‌ని తీసుకోవాలని సూచిస్తున్నారు. జీడి పప్పు, బాదం పప్పు, విత్తనాలు, నట్స్‌లలో కూడా కావాల్సినంత పోషకాలు ఉంటాయి. ఎండబెట్టిన కొబ్బరిలోనూ పుష్కలంగా కాల్షియం ఉంటుంది. కాకపోతే, వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* ఇవి ట్రై చేయొచ్చు

పాలంటే ఇష్టం లేని వారు పెరుగు, బటర్ మిల్క్ వంటి పాల పదార్థాలు తీసుకోవచ్చు. పాలతో లభించే డి విటమిన్, బి విటమిన్, ప్రొటీన్లు శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. కాల్షియంను రాగుల రూపంలో తీసుకున్నప్పటికీ ప్రొటీన్లు, విటమిన్లు లభించే పదార్థాలను డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయి.

2023-06-02T06:44:48Z dg43tfdfdgfd