RELATIONSHIPS: నా కూతురు ముందే నా భర్త నన్ను కొట్టాడు, నేను అలానే చేయాలనుకుంటున్నాను

ప్రశ్న: మాకు పెళ్లయి ఏడేళ్లవుతుంది. అయిదేళ్ల కూతురు ఉంది. మేము సంతోషంగానే జీవిస్తున్నాము. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయి. ఈ మధ్యన ఒకసారి గొడవ అయింది. వాదిస్తుండగానే నా భర్త ఒక్కసారిగా నన్ను చంప దెబ్బ కొట్టాడు. అప్పుడు అయిదేళ్ల కూతురు ఎదురుగానే ఉంది. ఆమె తన తండ్రి నన్ను కొట్టడం చూసింది. కూతురు చూస్తోందనే జ్ఞానం కూడా లేకుండా ఆయన నన్ను కొట్టడం చాలా బాధ అనిపించింది. నేను ఇప్పుడు ఆయనను తిరిగి నా కూతురు ముందే చెంప దెబ్బ కొట్టాలని అనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల తన తల్లి ధైర్యవంతురాలని, ఎవరికీ భయపడదని ఆమె అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇలా చేయడం మంచిదేనా?

జవాబు: భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి, కానీ తిట్లను, దెబ్బలను కాదు. మీ భర్త మిమ్మల్ని చెంప దెబ్బ కొట్టాడని మీరు తిరిగి కొడితే ఆయనకు మీకు తేడా ఏముంది? ఆయనకు లేని జ్ఞానం మీకు ఉన్నట్టా? మీ పాపముందే ఆయన మిమ్మల్ని కొట్టడం తప్పే. కానీ మీరు తిరిగి ఆయనను ఆ క్షణమే కొట్టి ఉంటే సమస్య పెరిగి ఉండేది. కానీ మీరు కొట్టకుండా సంయమనం పాటించారు. ఆ విషయంలో మిమ్మల్ని అభినందించాలి. ముందుగా మీరు మీ భర్తతో మాట్లాడండి. పాప ముందే కొట్టడం వల్ల ఆమె ఆలోచనలపై ఎలాంటి ప్రభావం పడుతుందో వివరించండి. అంతేకానీ కన్నుకు కన్ను అనే పాలసీని ఫాలో అయితే ఉపయోగం లేదు. మీ పాప ముందు మీరు మీ ధైర్యాన్ని చూపించాలి అనుకుంటున్నారు, కానీ మీరు చూపించాల్సింది ప్రేమ. మీ భర్తను మీరు ప్రేమతోనే జయించాలి తప్ప దెబ్బలతో కాదు. మీ పాప ముందే మీ భర్తతో కలిసి కూర్చుని మాట్లాడండి. అలా కొట్టడం తప్పని తెలియజేయండి. ఆ మాటలు మీ పాప కూడా వింటుంది. అలాగే మీ భర్త చేత కూడా ఆ విషయాన్ని పాపకు చెప్పించండి. తను చేసింది తప్పని, ఎవరినీ కొట్టకూడదని వివరించండి. మీ ఇద్దరూ ఇంట్లో కొట్టుకోవడం ఆమె చూస్తే పెద్దయ్యాక అలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. దీనివల్ల మీ పాప జీవితాన్ని కూడా మీరు చెడుగా ప్రభావితం చేసిన వారు అవుతారు.

అతను ఎలాంటి సందర్భంలో కొట్టాల్సి వచ్చిందో, అతని మానసిక స్థితి ఎలా ఉందో కూడా మీరు అర్థం చేసుకోండి. కొట్టడం ఎప్పటికైనా తప్పే. ఇంతకుముందు కూడా ఆయన మిమ్మల్ని తరుచూ కొడుతూ ఉంటే అది నేరం అని చెప్పాలి. ఇదే తొలిసారి అయితే ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. మీ భర్తతో ఈ విషయాన్ని మీరు చర్చించాలి. కమ్యూనికేషన్ లోపం వల్ల కూడా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ లోపం లేకుండా చూసుకుంటే ఒకరిని ఒకరు కొట్టుకునే అవకాశం, తిట్టుకునే అవకాశం ఉండదు. మీరు ధైర్యవంతురాలని చెప్పడానికి కూతురు ముందే తండ్రిని కొడితే... ఇక ఆమె తల్లిదండ్రులకు ఎలాంటి గౌరవం ఇస్తుంది. ముందు మీ ఇద్దరూ ఒకరిపై ఒకరు గౌరవం, ప్రేమ పెంచుకోండి. మీ ఇద్దరినీ చూసి మీ పాప ప్రేమను,  గౌరవాన్ని ఎదుటివారికి ఇవ్వడం నేర్చుకోవాలి. అంతే తప్ప కొడితే తిరిగి కొట్టడం, తిడితే తిరిగి తిట్టడం కాదు నేర్చుకోకూడదు. 

Also read: బ్లాక్ డైమండ్ ఆపిల్స్ గురించి విన్నారా? నల్ల వజ్రాల్లా మెరుస్తాయివి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

2023-05-31T05:34:32Z dg43tfdfdgfd