RETURN GIFTS: పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్.. అతిథులకు మందు బాటిళ్లు పంపిణీ

Return Gifts: వివాహాలకు వెళ్లినపుడు వధూవరులకు గిఫ్ట్‌లు ఇవ్వడం సంప్రదాయం. అయితే కొంత మంది వధూవరుల కుటుంబాలకు చెందిన వారు.. తమ కుమారుడు లేదా కుమార్తె పెళ్లి గురించి ఊరూరా చెప్పుకోవాలని రిటర్న్ గిఫ్ట్‌లు అందిస్తారు. తాంబూలం, స్టీల్ సామాన్లు, కొత్త బట్టలు, ఇంకా విభిన్న రకాల వస్తువులు.. అతిథులకు అందిస్తారు. అయితే పుదుచ్చేరిలో జరిగిన ఓ పెళ్లి మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వచ్చిన అతిథులకు మద్యం బాటిల్ అందించడంతో అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అక్కడ ఉన్న సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి అతిథులకు లిక్కర్ సీసాలు ఇవ్వడంతో కొందరు విమర్శిస్తుండగా.. మరికొందరు మాత్రం ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

ఎవరి వివాహం

తమిళనాడులోని చెన్నైకి చెందిన నిర్మల్‌కు.. పుదుచ్చేరికి చెందిన ఆర్తికి వివాహం నిశ్చయమైంది. పుదుచ్చేరిలోని మహాలక్ష్మి వెడ్డింగ్ హాలులో మే 28 న పెళ్లి జరిపించారు. అందులో భాగంగానే రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అతిథులు వెళ్లే సమయంలో వారికి ఒక కవర్‌ను పెళ్లి కూతురు తరఫు బంధువులు అందించారు. అందులో తాంబూలంతోపాటు మద్యం బాటిల్ ఉండటంతో అందర్నీ విస్మయానికి గురిచేసింది. సాధారణంగా పుదుచ్చేరిలో పెళ్లికి విచ్చేసిన అతిథులకు తమలపాకులతో కూడిన తాంబూలం ప్యాకేజీలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్యాకేజీలో తమలపాకులు, పండ్లు, స్వీట్లు, పుస్తకాలు, దండలు, పూలు ఉంటాయి. ఇవన్నీ లేకపోయినా కనీసం ఒక కొబ్బరికాయను అయినా అందిస్తారు. అలాంటి సంప్రదాయానికి భిన్నంగా ఈ పెళ్లిలో లిక్కర్ బాటిళ్లను పంపిణీ చేయడంతో పెళ్లికి వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ మొత్తం తతంగానికి సంబంధించిన దృశ్యాలను అక్కడ పెళ్లికి హాజరైన వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఇక నెటిజన్ల కామెంట్లు, షేర్లతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. సాధారణంగా మద్యం తేలికగా దొరుకుతుందని చెన్నై వాసులు.. తరచూ పుదుచ్చేరికి వెళ్తుంటారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పండగలు, ఫంక్షన్లలో మద్యం అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాంటిదని మరికొందరు స్పందించారు. అయితే ఈ మద్యం బాటిళ్లు పంపిణీ చేయడం ఉద్దేశ పూర్వకంగ చేసింది కాదని పెళ్లి కూతురు స్నేహితులు చెబుతున్నారు. ఆ నూతన వధూవరులకు స్నేహితులు, బంధువులు లేరని.. అందుకే మద్యం పంపిణీ చేస్తే పెళ్లికి చాలా మంది వస్తారని ఆశించి ఇలా చేశారని కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఏది ఏమైనా ఒక బహిరంగ పెళ్లి వేడుకలో మద్యం పంపిణీ చేయడం పట్ల చాలా మంది నెటిజన్లు తప్పుపడుతున్నారు.

స్పందించిన బంధువులు

ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పెళ్లికూతురు మామ స్పందించారు. తమ బంధువులు మరియు చెన్నైకి చెందిన కొంత మంది మద్యం అందించాలని కోరినట్లు చెప్పారు. అందుకే ఈ విధంగా వచ్చిన అతిథులకు లిక్కర్ సీసాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పురుషులకు తాంబూలంతోపాటు అదే బ్యాగులో మద్యం బాటిల్ కూడా ఇచ్చినట్లు వివరించారు. మహిళలకు మాత్రం సాధారణంగా ఇచ్చే తాంబూలాన్ని ఇచ్చినట్లు చెప్పారు.

మండిపడిన బీజేపీ

ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది ముమ్మాటికీ సంప్రదాయాలను కించపరచడమేనని తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి నారాయణన్ ఆక్షేపించారు. సంస్కృతి, సంప్రదాయాలను అవమానపరిచే విధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

2023-06-02T10:31:25Z dg43tfdfdgfd