NARMADA PUSHKARALU 2024 నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటి.. పుష్కర స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందా?

Narmada Pushkaralu 2024 భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒకటైన నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Narmada Pushkaralu 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం, జీవ నదులను దేవతలుగా పూజిస్తారు. భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒక్కో నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలకు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని పుణ్య స్నానాలను ఆచరిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురుడు వృషభరాశిలో ప్రవేశించిన సమయం నుంచి 12 రోజుల పాటు నర్మదా నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ సమయంలో నదిలో పుణ్య స్నానం ఆచరించి, పేదలకు దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా నర్మదా నది విశిష్టత, పుష్కరాల వేళ దాన ధర్మాలు ఎందుకు చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...నర్మదా నది ప్రాముఖ్యత..

గురుడు వృషభరాశిలో సంచారం చేసే సమయంలో రేవా నదీ పుష్కరాలు ప్రారంభం అవుతాయి. రేవా నదినే నర్మదా నది అంటారు. ఓంకారేశ్వర్‌లో నర్మదా నదీ తీరంలో అనేక ఘాట్‌లు నిర్మించబడ్డాయి. ఇక్కడ ఉండే నదీ ప్రవాహం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. నీరు కూడా చాలా స్వచ్ఛతతో ఉంటుంది. ఘాట్ల వద్ద ఎక్కువ లోతు కూడా ఉండదు. భక్తులందరూ స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్ల కంటే ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే, అనేక తీర్థయాత్రల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.​Akshaya Tritiya 2024 మీ రాశి ప్రకారం, అక్షయ తృతీయ వేళ వీటిని దానం చేస్తే.. మీ ఇంట కనకవర్షం కురుస్తుందట..!

సకల పాపాలు తొలగిపోతాయని..

చక్ర తీర్థ ఘాట్, అభయ్ ఘాట్, భైరోన్ ఘాట్, కేవల్ రాం ఘాట్, బ్రహ్మపురి ఘాట్, సంగం ఘాట్, అభయ్ ఘాట్లలోనూ స్నానం చేయొచ్చు. ఈ నదిలో స్నానం చేసి మూడుసార్లు మునిగిన(మేద్యం) తర్వాత, నీటిని సంప్రోక్షణ చేసుకోవడం(చల్లుకోవడం) మార్దనమని వ్యవహరిస్తారు. మేధ్యం తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ తొలగిస్తుందని, మార్దనం, స్థాన, శరీర, ద్రవ్యశుద్ధిని కలిగిస్తుందని పెద్దలంటారు. నీటిని నారాయణ స్వరూపంగా భావిస్తారు కాబట్టి, ఈ నదిలో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

ఎక్కడి నుంచి ప్రారంభమంటే..

నర్మదా నది మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌లో ఆవిర్భవించి.. పశ్చిమదిశగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వేలాది కిలోమీటర్లు ప్రయాణించి పారిశ్రామిక నగరమైన సూరత్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. అందుకే నర్మదా నది ప్రయాణించే ప్రాంతాలతో పాటు అమర్ కంఠక్‌ను హిందువులు అత్యంత పవిత్రమైన దేశంగా భావిస్తారు. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రాలున్నాయి. అమర్ కంఠక్‌లో పుష్కర స్నానం చేస్తే, ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

దాన ధర్మాలు..

పుష్కరాల సమయంలో 12 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో వస్తువును దానం చేయాలని పురాణాల్లో పేర్కొనబడింది. మొదటి రోజున బంగారం, వెండి, ధాన్యం, భూదానం చేయడం వల్ల మోక్షం లభించి స్వర్గానికి చేరుకుంటారు. రెండో రోజు బట్టలు, ఉప్పు, రత్నాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు. మూడో రోజు బెల్లం, పండ్లను పేదలకు దానం ఇవ్వాలి. నాలుగో రోజు నెయ్యి, నూనె, పాలు, తేనే వంటి వాటిని దానం చేయడం వల్ల దీర్ఘాయువు పొందుతారు. ఐదో రోజు ధాన్యం, హలం, గోదానం ఇవ్వాలి. ఆరో రోజు ఔషధాలు, చందనం, కస్తూరి, కర్పూర దానం చేస్తే, పూర్తి ఆరోగ్యవంతులవుతారు. ఏడో రోజున పీట, శయ్య దానం చేసిన వారు వచ్చే జన్మలో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ఎనిమిదో రోజున చందన దానం, పుష్ప మాల, తొమ్మిదో రోజున పిండ ప్రదానం, కంబళి దానం, పదో రోజున కూరగాయలు, సాలగ్రామం, పుస్తకాలు, పదకొండో రోజున గజ దానం చేస్తే, మరణం అనంతరం వైకుంఠంలో అడుగు పెడతారు. చివరగా 12వ రోజున నువ్వులు దానం చేయడం వల్ల సకల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

నర్మదా నది దర్శనంతో..

పద్మ పురాణం, మహా భారతం, హరివంశం తదితర పురాణాల్లో నర్మదా నది ప్రస్థావన ప్రముఖంగా వినిపిస్తుంది. నర్మదా అంటే అన్ని నదులలో శ్రేష్టమైనది. సరస్వతి 3 రోజుల్లో, యమున ఏడు రోజులు, గంగా నది అయితే ఒకరోజు మనల్ని పాపవిముక్తి చేయగలదు. అయితే నర్మదా నదిని దర్శనం చేసుకుంటే చాలు పరిశుద్ధం అయిపోతారని అనేక పురాణాలలో పేర్కొనబడింది.

పుష్కరాలతో పాటు..

ఈ నదీ పుష్కరానికి వెళ్లాలనుకున్న వారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీ మహా క్షేత్రానికి వెళ్లి, అక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, మహాకాళీ శక్తి పీఠాన్ని, ఇతర దర్శనీయ ప్రదేశాలను వీక్షించి, అక్కడి నుంచి ఇండోర్ మీదుగా అమరేశ్వర క్షేత్రానికి చేరుకుని ఓం కారేశ్వర, అమరేశ్వరులను సేవించుకుని పుష్కర స్నానమాచరించాని పండితులు చెబుతున్నారు.గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Religion News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-02T11:16:18Z dg43tfdfdgfd