మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో..

Kachidi Fish: మనకంటూ రాసిపెట్టి ఉండాలే కానీ.. అదృష్టదేవత మనం ఇంట్లో ఆలౌట్ పెట్టుకుని పడుకున్నా కూడా కాలింగ్ బెల్ కొట్టి మరీ హాయ్ చెప్తుందట. అలాగే ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొంతమంది మత్స్యకారుల పరిస్థితి. ఎందుకంటే వారికి అలా ఇలా సుడి తిరగలేదు. దెబ్బకు లక్షాధికారులు అయ్యారు మరి. ఈ అదృష్టజాతకుల అసలు కథలోకి వెళ్తే .. వారికి ఎలాంటి లక్ తగిలింది. ఎలా సుడి తిరిగిందనేది తెలుస్తుంది.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలానికి చెందిన కొంతమంది మత్స్యకారులు.. ఇటీవల చేపలవేటకు వెళ్లారు. అయితే ఉదయాన్నే ఎవరి ముఖం చూసి బయల్దేరారో తెలియదు కానీ.. మనోళ్ల పంట పడింది. ఏకంగా 28 కచిడీ చేపలు వారి వలకు దొరికాయి. ఇంకేం వారి దశ తిరిగిపోయింది. సంబరాల్లో మునిగిపోయారు. అదేంటీ చేపలు వలలో పడితే ఇంత ఆనందమా అని మీకు డౌట్ అక్కర్లేదండోయ్. పడింది అలాంటి, ఇలాంటి చేపలు కాదు.. కచిడీ చేపలు. అయితే వాటి ప్రత్యేకత ఏంటి అంటారా? చెప్పాలంటే చాలా ఉంది మరి.

అయితే అంతకుముందు ఈ కచిడీ చేపలు ఎంతకు అమ్మారో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం పక్కా. మత్స్యకారుల వలలో మొత్తం 28 కచిడీ చేపలు పడ్డాయి. వాటిలో ఒక్క చేప బరువే సుమారు 30 కేజీల వరకూ ఉందట. ఈ చేపలను తీసుకువచ్చి అంతర్వేది మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో వేలం వేశారు. ఈ వేలంలో కచిడీ చేపలు రికార్డు ధర పలికాయి. 30 కేజీల బరువు తూగిన చేపను ఓ దళారి 3 లక్షల 25 వేలకు వేలంపాటలో దక్కించుకున్నాడు. మిగతా చేపలు 37 లక్షల75,000 లకు ఇతర దళారులు దక్కించుకున్నారు. మొత్తానికి 28 కచిడీ చేపలు కలిపి ఏకంగా 41 లక్షలకు అమ్ముడుపోవటంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే కచిడి చేపలకు ఎందుకంత డిమాండ్ అని మీకు డౌటనుమానం రావచ్చు. ఈ కచిడీ చేపలు చాలా అరుదుగా మత్స్యకారుల వలలో చిక్కుతాయి. ఈ చేపల బ్లాడర్‌ను ఔషధాల తయారీలోనూ, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారం తయారీలో, ఖరీదైన వైన్‌ తయారీలోనూ వినియోగిస్తారట. అందుకే ఈ చేపలకు అంత డిమాండ్‌ ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపలు వలలో చిక్కితే వారి పంట పండినట్టే అంటున్నారు.

ఈ కచిడీ చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. అయితే ఈ కచిడీ చేపను గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారు. బంగారం తరహాలో మెరుస్తూ ఉండటమే ఇందుకు కారణం. ఇక ఈ చేపలు ఎప్పుడూ ఒకేచోట స్థిరంగా ఉండవని.. ఒకచోటు నుంచి మరో చోటికి వెళ్తుంటాయని మత్స్యకారులు చెప్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T16:45:45Z dg43tfdfdgfd