AKSHAYA TRITIYA : అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి.. మోసాలు ఇలా జరుగుతాయి..?

Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి.. మోసాలు ఇలా జరుగుతాయి..?

అక్షయ తృతీయ వస్తే చాలు... ఎక్కువ మంది నగల కొట్టుకి క్యూ కడతారు. ఇవ్వాళ కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనాలి అనుకుంటారు. అందుకు తగ్గట్టే నగల షాపుల వాళ్లు డిస్కౌంట్లు, ఆఫర్లు పెడుతుంటారు.

బంగారు పండుగ

పది వేలు విలువ చేసే వస్తువు కొంటే పది శాతం డిస్కౌంట్, పది గ్రాముల బంగారం కొనుగోలు చేస్తే ఒక గ్రాము బంగారం ఉచితం. ఇలా వ్యాపారులు పోటాపోటీగా అక్షయతృతీయ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.బంగారం అక్షయ తృతీయ రోజు కొంటేనే శుభాలు జరుగుతాయా? ఈరోజు ఎందుకు కొనుగోలు చేయాలి? బంగారం కొన్నవారికే అదృష్టం వరిస్తుందా?. కొనుగోలు చేయని వాళ్లకి కష్టాలు వస్తాయా? అంటూ మహిళలు నుంచి భిన్న వాదనలు. కూడా వినిపిస్తున్నాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడంపై కొందరు మహిళలను అడిగితే ఇలా చెప్పారు. 

లక్ష్మీదేవి ఇంట్లోకి..

వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే తదియను 'అక్షయ తృతీయ అంటారు. మహాభారతంలో ధర్మరాజు సూర్యరాధన చేసి అక్షయ పాత్రను పొందిన రోజు ఇదేననీ.. అందువల్ల అక్షయ తృతీయగా పేరొచ్చిందనేది కొందరి విశ్వాసం. అలాగే పరమ పవిత్రమైన గంగానది దీవి నుంచి భువికి దిగివచ్చిన రోజు కూడా ఇదేనని కొందరి భావన. అంతేకాదు, శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించి కుచేలుడు అనంతమైన సంపదలు పొందినదీ ఈరోజునే అంటారు. ఒక ఉసిరి కాయను భిక్షగా వేసిన పేదరాలి దయా గుణాన్ని గుర్తించి జగద్గురువులైన ఆదిశంకరులు అమ్మవారిని ప్రార్ధించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియ నాడేనని చెబుతారు. ఇలా అక్షయ తృతీయకు అనేక రకాలుగా ప్రాధాన్యం ఉంది. అందుకే ఈరోజు బంగారం కొంటే ఇంట్లోకి

లక్ష్మీదేవి వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను". అంటోంది శ్రీశాంతి. ఈమె నమ్మకం ఇలా ఉంటే...బంగారం కొనడానికి మంచి, చెడులేంటి? అనేవాళ్లు లేకపోలేదు.

బంగారం కొండెక్కి కూర్చుంటది

"బంగారం కొనడానికి మంచి, చెడు లాంటివి ఏమీ ఉండవు. అంతేకాదు అక్షయ తృతీయ రోజు బంగారం ధరలను పెంచేస్తారు. అది తెలియక జనం షాపులకు క్యూ కడుతున్నారు. ధర పెంచి డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వడం ఎందుకు? అందుకే నేను వీటన్నింటిని నమ్మను. చేతిలో డబ్బు, కొనాల్సిన అవసరం ఉన్నప్పుడు బంగారం కొంటాను. మామూలు రోజుల్లో ధర తక్కువగా ఉన్నప్పుడు షాపింగ్ చేస్తాను. అయినా అక్షయతృతీయ రోజే బంగారం కొనాలనే రూల్ ఎక్కడా లేదనేది ప్రశాంతి అభిప్రాయం.

గుడ్డిగా కొంటే

"అక్షయ తృతీయకు బంగారం కొంటే మంచి జరుగుతుందని గుడ్డిగా కొంటే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఆఫర్ల హడావుడిలో నగలు కొనే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కూరగాయలో, మరేదైనా వస్తువో అయితే వందల్లో నష్టం ఉంటుంది. కానీ బంగారం కొనే ముందు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టం వేలల్లో, లక్షల్లో ఉంటుంది. చాలామంది. పసుపురంగు అధికంగా వచ్చేలా రసాయనాలను వాడతారు. బంగారం శాతం తక్కువగా ఉన్నా.. 22 క్యారెట్లు ఉందని చెప్పి డబ్బు వసూలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఆఫర్ల హడావుడిలో పడి చాలామంది గుడ్డిగా మోసపోతారు. అందుకే బంగారం కొనేముందు . జాగ్రత్త వహించాలి'' అంటోంది శ్రీజ.

 

తరాలుగా వస్తోంది.

"అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందని ఎప్పట్నుంచో అంటున్నమాటే. మా అమ్మ ప్రతి అక్షయ తృతీయ ఒక గ్రాము బంగారం కొంటుంది. ఆ బంగారాన్ని అంతా కలిపి నాకు చైన్ చేయించింది. అప్పుడు కొంచెం కొంచెం కూడబెడితే భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుందని అమ్మ నమ్మకం. అందుకే పండుగ రోజు ఖచ్చితంగా కొనేది. నేను కూడా రెండు సంవత్సరాల నుంచి ప్రతి అక్షయ తృతీయకి ఒక గ్రాము బంగారం. కొంటున్నాను" అంటోంది శైలజ. 

లేటెస్ట్ కలెక్షన్

అదృష్టంతో సంబంధం సంగతేమో కానీ.. లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి అందుకే ఈరోజునే కొంటాం. అంటారు ఇంకొందరు. "అక్షయ తృతీయ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది. మిగిలిన కాలంతో పోలిస్తే ఈరోజు చాలామోడల్స్ మార్కెట్ లో రిలీజ్ అవుతాయి.అందుకే బంగారం. కొనడానికి ఇష్టపడతాము, కలిసివస్తుందని కూడా అందరూ అంటారు. లేటెస్ట్ కలెక్షన్ తోపాటు మంచి జరుగుతుందంటే ఈ డేని ఎందుకు మిస్ చేసుకోవాలి. అయినా ఎవరి నమ్మకాలు వాళ్లవి. కొనాలి కదా అని ఆర్ధిక పరిస్థితి బాలేక పోయినా అప్పుచేసి కొనాలనుకోను. వస్తువు అవసరాన్ని బట్టి కొంటాను. కొనేదేదో ఈరోజే కొంటే. సంప్రదాయాన్ని కూడా గౌరవించినట్టు ఉంటుంది కదా అంటోంది ఆస్మా.

కమర్షియల్ బిజినెస్

నమ్మకాలు, ఆచారాలు పక్కన పెడితే ఇదో బిజినెస్ స్టంట్ అంటోంది విష్ణుప్రియ. అక్షయ తృతీయను..బంగారం అమ్ముకోవడానికి వ్యాపారులే సృష్టించారు. ఇదొక కమర్షియల్ బిజినెస్ అయ్యింది ఇప్పుడు. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే సిరులు కురుస్తాయని, కొనకపోతే లక్ష్మీదేవి తలుపుతట్టదని వింటుంటే నవ్వొస్తుంది. 10 గ్రాముల బంగారం కొంటే ఒక గ్రాము బంగారం ఫ్రీ. ఏ లాభం లేకుండా ఎవరైనా వ్యాపారం ఎందుకు చేస్తారు. బంగారం రేటు పెంచి ఆ డబ్బుని ఆఫర్లో కలిపేస్తుంటారు. ఈ ఒక్క పండుగే కాదు ఫ్రెండ్ షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అన్నింటిని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. నేను ఇంత వరకు అక్షయతృతీయ రోజు బంగారం కొనలేదు. అయినా ఆర్థికంగా బాగానే ఉన్నాను. అయినా ఎవరి నమ్మకాలు వాళ్లవి. నేను మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పిందామె.

 

ఆఫర్స్ ఆఫర్స్

ఎవరి వాదన ఎలా ఉన్నా మార్కెట్లో అక్షయతృతీయ ఆఫర్స్ మాత్రం జోరుగా ఉన్నాయి. వ్యాపారులు పోటీ పడి మరీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.అక్షయ తృతీయ సందర్భంగా బంగారం, పోల్కీ, డైమండ్ నగలు కొన్నవారికి ఉచితంగా బంగారు నాణేలను ఆఫర్ చేస్తున్నాయి కొన్ని నగల వ్యాపార సంస్థలు. అంతేకాదు రూ. 50,000 కన్నా ఎక్కువ విలువైన డైమండ్ అన్ కట్ డైమండ్ నగలు కొన్న కస్టమర్లకు 22 క్యారెట్ల గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నాయి. ఎక్కువ విలువైన నగలు కొన్న కస్టమర్లకి 200 మిల్లీగ్రాముల గోల్ కాయిన్ ఉచితంగా ఆఫర్ చేస్తున్నాయి. డైమండ్, బంగారు నగలపై 15 శాతం, పెళ్లి నగలపై 50 శాతం మేడింగ్ ఛార్జీలను తగ్గిస్తున్నాయి ఇంకొన్ని స్టోర్స్. వీటితో పాటు ప్రీ బుకింగ్ ఆఫర్లు, ఉచిత బంగారు నాణేలు, రెగ్యులేటెడ్ పర్సేజ్ అడ్వాన్స్ స్కీమ్స్ లాంటి అద్భుతమైన ఆఫర్లను కూడా ప్రకటించాయి.

అదిరిపోయే డిజైన్లు

అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్స్ ని, హంపీతోపాటు బేలూరులోని చెన్నకేశవ ఆలయం, ప్రసిద్ధ భువనేశ్వర ఆలయం గోపురం, ఏనుగులు, గుర్రాలు, కమలం, ఆలయం ద్వారం వద్ద చెక్కిన దశావతారం లాంటి అనేక డిజైన్లతో నగలను అక్షయతృతీయ స్పెషల్ మార్కెట్ లో రిలీజ్ చేశాయి కొన్ని ఆభరణాల వ్యాపార సంస్థలు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T06:18:50Z dg43tfdfdgfd