GIRL FIRST PERIOD: 14 ఏళ్ల బాలికకు మొదటి పీరియడ్స్.. ఆత్మహత్య చేసుకున్న చిన్నారి

Girl First Period: మన దేశంలో చాలా విషయాలు బహిరంగంగా చెప్పడానికి, మాట్లాడటానికి అంతా వెనక్కి తగ్గుతూ ఉంటారు. ఇక మహిళల పీరియడ్స్, శృంగారానికి సంబంధించిన వాటి గురించి నలుగురితో చర్చించడానికి సంకోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా వాటి గురించి మాట్లాడితే సమాజంలో చులకనగా చూస్తారు అనే భావన అందరిలో నాటుకుపోయింది. దీంతో డాక్టర్లు, కౌన్సిలింగ్ ఇచ్చేవారు ఇలాంటి వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి విషయాలపై అవగాహన లేక చాలా మంది తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. అలాగే తొలిసారి పీరియడ్స్ వచ్చిన ఓ బాలిక ఆ బాధ, నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది. చిన్నారులకు ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

మహారాష్ట్ర ముంబైలోని మల్వానీ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక లక్ష్మీ చాల్స్‌లో నివసిస్తున్న ఓ 14 ఏళ్ల బాలికకు మొదటిసారి పీరియడ్స్‌ ప్రారంభం అయ్యాయి. అయితే పీరియడ్స్ గురించి ఎలాంటి అవగాహన లేని ఆ బాలిక.. ఆ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని, బాధను భరించలేక తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో ఈ నెల 26 వ తేదీన రాత్రి వేళ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇంటికి వచ్చి చూడగా.. బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారితో కలిసి ఆమెను స్థానికంగా కందివలిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ బాలికను పరీక్షించిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి.. వారు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. బాలికకు ఇటీవలె మొదటిసార పీరియడ్స్ వచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అయితే దాని వల్ల కలిగే నొప్పిని, బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మృతురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

బాలిక మానసిక పరిస్థితి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆమె ఫ్రెండ్స్‌ను కూడా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. బాలిక సెల్‌ఫోన్‌, సోషల్ మీడియాను చెక్ చేసి.. బాలిక ఆత్మహత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలుసుకుంటామని పేర్కొన్నారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా పీరియడ్స్ సంబంధించి టీనేజర్లలో సరైన అవగాహన లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణం అవుతోందని డాక్టర్లు పేర్కొన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T15:20:57Z dg43tfdfdgfd