LIFE STYLE: మీరు కుబుసం వీడుతున్నారా లేదా!

హడావిడి మోడ్రన్ లైఫ్ లో మనసుకు ఉల్లాసమనేదే లేకుండా జీవితాలు మోనోటోనస్ గా మారుతున్నాయి. ఇందువల్ల నిర్లిప్తత, యాంగ్జైటీ, రకరకాల నెగెటివ్ ఆలోచనలు, డిప్రెషన్ లో కూరుకుపోతున్నారు. ఈ ఒత్తిడిని అధిగమించి, అనవసరపు ఆలోచనల కుబుసాన్ని వదిలించుకొని, కొత్త ఆలోచనలతో ఉల్లాసంగా ఉంటూ, పనిలో ప్రొడక్టివిటీని పెంపొందిచుకోవటానికి కొన్ని ఎఫెక్టివ్ ఉపాయాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి.

మీ మైండ్ లో ఏముందో పేపర్ మీద రాయండి

ఊపిరాడనీయకుండా వచ్చే ఆలోచనలు, టెన్షన్స్, భయాలు మెదడు మీద విపరీతమైన ఒత్తిడిని పెంచుతాయి. యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నవాళ్లు 24/7 ఇలాంటి ఒత్తిడితో బాధపడుతుంటారు. నిద్ర రాదు. అనుక్షణం ఏదో గుబులు. ఇలాంటపుడు మీకున్న భయాలను, టెన్షన్స్ ను, ఇంకా మరే ఆలోచనలున్నా వాటిని తోచినట్టు పేపర్ తీసి రాయండి. అపుడొక మెంటల్ క్లారిటీ వస్తుంది. మైండ్ లో బరువు తగ్గి తేలిక పడుతుంది. 

ఇంటిని శుభ్రం చేసుకోండి

ఇల్లు శుభ్రం చేయటానికి మెదడును క్లియర్ చేయటానికి ఏం సంబంధం ఉందనుకుంటున్నారా? చాలా దగ్గరి సంబంధం ఉంది. గజిబిజిగా, చిందరవందరగా వస్తువులు పడేసి ఉన్న గదుల్లో కూర్చొని ఏ పని మీదా ఫోకస్ చేయలేమని, అందువల్ల చాలా చికాకుగా ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి.   చాలామంది ఇల్లు శుభ్రం చేయటాన్ని మూడ్ బాలేదనో, వేరే పనుందనో వాయిదా వేస్తుంటారు. దీని వల్ల క్లీన్ చేయాల్సిన పరిసరాలను చూసినప్పుడల్లా విజువల్ కార్టెక్స్ ప్రేరేపితమయ్యి, మిగిలిన పని మీద ఫోకస్ చేయలేకపోతారు. మొత్తం ఒకేరోజు క్లీన్ చేయటం వీలు పడనప్పుడు, రోజులో ఒక సమయం సెట్ చేసుకొని, ఒక్కో గదిని ఒక్కో రోజు క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేయటమంటే అనవసరమయినవి తీసేసి, గదిని మీకు నచ్చినట్టుగా, కళ్లకింపుగా అలకరించుకోవటం. దీనివల్ల మీ క్రియేటివ్ బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. ఫ్రిడ్జ్, కార్, క్లాసెట్ లాంటివి క్లీన్ చేయటంతో మొదలుపెట్టండి. సింపుల్ గా అయిపోతుంది. 

వ్యాయామం

ఎక్సర్సైజ్ శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. వాకింగ్, యోగ, రన్నింగ్, డాన్సింగ్ వంటివి చేయటం వల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, మైండ్ క్లియర్ అవుతుంది. వ్యాయమం చేయటం దినచర్యలో భాగం చేసుకోవటం వల్ల రోజంతా మైండ్ ఫ్రెష్ గా, ఎనర్జెటిక్ గా ఉంటుంది.

ప్రకృతికి దగ్గరగా బతకటం

మొక్కలు పెంచటం, గార్డెనింగ్ చేయటం, కాసేపు రోజూ నేచర్ లో నడవటం, పార్క్ కి వెళ్లటం, హైకింగ్ కి వెళ్లటం వంటి చిన్న చిన్న పనులు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ప్రకృతిని మించిన థెరపీ లేదు. ఈరోజుల్లో మనుషులు తమను తాము ప్రకృతి నుంచి దూరం చేసుకొని బతుకుతున్నారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది.

కృతజ్ఞత

జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తించి, గ్రాటిట్యూడ్ చూపటం వల్ల ఆలోచనలు నెగెటివ్ వైపు నుంచి మంచి విషయాల వైపుకు మళ్లుతాయి. ఇది ప్రతిరోజూ రెండు మూడుసార్లు ప్రాక్టీస్ చేయటం వల్ల పాజిటివ్ ఆట్టిట్యూడ్ అలవడుతుందని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. 

2024-04-26T00:57:17Z dg43tfdfdgfd