STRAWBERRY PANCAKE: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే పిల్లలకి తెగ నచ్చేస్తుంది

Strawberry Pancake: స్ట్రాబెర్రీల పేరు చెబితేనే పిల్లలకు నోరూరిపోతుంది. ఇక స్ట్రాబెర్రీ పాన్ కేక్... బ్రేక్‌ఫాస్ట్ గా అందిస్తే వారు మరింత ఇష్టంగా తింటారు. దోశలు, ఇడ్లీలు, పూరీలు ఎప్పుడూ వండేవే. అప్పుడప్పుడు ఇలాంటి కొత్త బ్రేక్‌ఫాస్ట్ లను వారికి రుచి చూపించండి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పదార్థాలు కూడా ఉంటాయి. స్ట్రాబెర్రీ పాన్‌కేక్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక్కసారి తయారు చేసి చూడండి. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

స్ట్రాబెర్రీ పాన్ కేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

స్ట్రాబెర్రీలు - ఆరు

గోధుమ పిండి - ఒక కప్పు

వెనెల్లా ఎసెన్స్ - మూడు చుక్కలు

బేకింగ్ పౌడర్ - ఒక స్పూను

తేనె - నాలుగు స్పూన్లు

పెరుగు - అరకప్పు

బటర్ - రెండు స్పూన్లు

కోడి గుడ్డు - ఒకటి

చక్కెర - రెండు స్పూన్లు

స్ట్రాబెర్రీ పాన్ కేక్ రెసిపీ

1. స్ట్రాబెర్రీలను మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి.

2. వాటిని గిన్నెలో వేయాలి. ఆ గిన్నెలో చక్కెర కలిపి బాగా గిలక్కొట్టాలి.

3. అందులోనే పెరుగు, బేకింగ్ పౌడర్, గోధుమపిండి వేసి బాగా కలుపుకోవాలి.

4. ఆ మిశ్రమంలో వెనిల్లా ఎసెన్సు, తేనె, గుడ్డు కొట్టి వేయాలి.

5. మొత్తం మిశ్రమాన్ని దోశల పిండిలా బాగా కలుపుకోవాలి.

6. దోశల పిండి అంత జారుడుగా కాకుండా మందంగా ఉండేలా చూసుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బటర్ ను రాయాలి.

8. స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని అట్లులాగా పోసుకోవాలి.

9. రెండు వైపులా కాల్చుకొని తీసి ప్లేట్లో వేసుకోవాలి.

10. అంతే స్ట్రాబెర్రీ పాన్ కేక్ రెడీ అయినట్టే. ఇది తీయగా ఉంటుంది.

11. కాబట్టి పిల్లలకు కచ్చితంగా నచ్చుతుంది.

12. ఈ పాన్ కేక్ తినేందుకు చట్నీలు, సాస్ వంటివి అవసరం లేదు.

13. కేవలం పాన్ కేక్‌ని నేరుగా తినొచ్చు. పిల్లలు ఒక్కసారి తిన్నారంటే చాలా ఇష్టపడతారు.

స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. అలాగే కోడిగుడ్లు, తేనె వంటివి కూడా శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. చాలామంది స్ట్రాబెర్రీ పాన్‌కేక్ కోసం మైదాను వినియోగిస్తారు. మైదా అనారోగ్య కారకం. కాబట్టి మైదాకు బదులు గోధుమపిండిని వినియోగిస్తే మంచిది. లేదా మినప పిండి ఉపయోగించినా మంచిదే. ఇంకా వీలుకాకపోతే దోశల పిండిలో స్ట్రాబెర్రీ పేస్టు, వెనీలా ఎసెన్స్, తేనే వంటివి కలిపి పాన్ కేక్ వేయవచ్చు.

2024-05-03T00:50:43Z dg43tfdfdgfd