SURYA TILAK: రామనవమి వేళ అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిని ముద్దాడిన సూర్య కిరణాలు

Surya Tilak: అయోధ్యలో మరో మహా ఘట్టం పూర్తి అయింది. శ్రీరామనవమి సందర్భంగా గర్భగుడిలో ఉన్న అయోధ్య రాముడి నుదుటిపై సూర్య తిలకం కనువిందు చేసింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3-3.5 నిమిషాల పాటు.. ఇలా బాలరాముడికి సూర్య తిలకంలా సూర్యుడి కిరణాలు ప్రసరించాయి. రాముడి విగ్రహం నుదుటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో.. 3-3.5 నిమిషాలపాటు ప్రసరించాయి. అయోధ్య రామాలయ నిర్మాణం చేపట్టే సమయంలోనే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుల కోరిక మేరకు కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ-సీబీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ఇలా శ్రీరామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం పూట సూర్యతిలకం వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అయితే ఈ సూర్యతిలకం ఏటా శ్రీ రామ నవమి రోజున అయోధ్యలో కనువిందు చేయనుంది. ఇక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం పూర్తి చేసుకున్న తర్వాత తొలిసారి ఈ అపూర్వ ఘట్టం చోటు చేసుకోవడం విశేషం. అయితే మరో 19 సంవత్సరాల పాటు శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహంపై ఇలా సూర్య తిలకం ఏర్పడనుంది. సూర్య తిలకం ఏర్పడిన సమయంలో గర్భగుడిలో ఉన్న అర్చకులు.. బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక అయోధ్యలో రాముడి నుదుటిపై ఇలా సూర్య కిరణాలు ప్రసరించేందుకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌-ఐఐఏ శాస్త్రవేత్తలను, పరిశోధకులను.. కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ-సీబీఆర్‌ఐ సంప్రదించింది. దీంతో శాస్త్రవేత్తలు పూర్తిగా అధ్యయనం చేసి ఆలయం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. కొన్ని పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. వీటన్నింటినీ బెంగళూరులోని ఆప్టికా అనే సంస్థ సమకూర్చింది.

అయోధ్య రామ మందిరం 3 అంతస్థులకు పైన శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేశారు. దాని నుంచి పైపు గుండా సూర్య కిరణాలు లోపలికి ప్రవహిస్తాయి. సూర్యుడి నుంచి కాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరాన్ని కూడా ఉంచారు. అది సూర్యకాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. తిరిగి శ్రీరామనవమి రోజున మళ్లీ ముందుగా నిర్దేశించిన చోటుకు తీసుకువస్తుంది. దీన్ని ఏర్పాటు చేయకముందే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కించి.. దాని ఆధారంగా బిగించారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుందని.. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అయితే ఏటా సూర్యకిరణాలు అదే ప్రాంతంలో ఎలా పడతాయి.. వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా.. గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉంటుందా అనే ప్రశ్నలు, సందేహాలు తెరపైకి రావడంతో వాటన్నింటినీ అధిగమించేందుకు మరో వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్‌ టీత్‌ మెకానిజం అనే వ్యవస్థను రూపొందించి ఇందులో ఉపయోగించారు. ఇక అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పడే ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-17T07:04:16Z dg43tfdfdgfd