అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి మాత్రమే కాదు.. ఈ వస్తువులు కూడా కొంటే అదృష్టం!

హిందూమతంలో అక్షయ తృతీయ (Akshaya Tritiya) పండుగకు ఎంతో విశిష్ఠత ఉంది. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు బంగారం, వెండి కొంటారు. ఈ ముఖ్యమైన పండుగను ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10న, శుక్రవారం నాడు వచ్చింది. అయితే ఈ పండుగ సందర్బంగా చేయాల్సిన పనుల గురించి న్యూస్18తో మాట్లాడారు పండిట్ నందకిశోర్ ముద్గల్. ఆయన డియోఘర్‌లోని ముద్గల్ జ్యోతిష్య కేంద్రంలోని పండితుల్లో ఒకరు. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండితో పాటు ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేయాలని నందకిశోర్ సూచించారు. వీటివల్ల అదృష్టం వరిస్తుందని చెప్పారు. ఆ వస్తువులు ఏవంటే..

* వీటిని కొన్నవారు శ్రీమంతులు

అక్షయ తృతీయ రోజు భూమి, భవనాలు, ఫ్లాట్లు, వాహనాలు వంటివి కొనుగోలు చేయడం మంచిది. దీంతో భక్తుల ఇళ్లకు అదృష్టం, సంపద, శ్రేయస్సు వస్తాయని నమ్ముతారు. ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటాయని భావిస్తారు. పండుగ రోజు కొనుగోలు చేసిన వాహనం ప్రమాదాలు లేకుండా నడుస్తుందని, భూమి విలువ భారీగా పెరుగుతుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ నాడు ఇలాంటి వస్తువులు, ఆస్తులను కొనుగోలు చేసినవారు లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, లక్ష్మీదేవి సంపద, అదృష్టం, యవ్వనం, సౌందర్యం అందించే దేవత. ఈ రోజు ఆ తల్లిని పూజిస్తే అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

* వ్యాపారానికి, షాపింగ్‌కి మంచి రోజు

కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, షాపింగ్ చేయడానికి కూడా అక్షయ తృతీయ చాలా శుభప్రదమైన రోజు. ఈ రోజున ఏ కొత్త పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుందని, వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నందకిషోర్ చెప్పారు. ఈ ఏడాది అక్షయ తృతీయ రోహిణి నక్షత్రంతో కూడా కలిసి వస్తుంది. చంద్రుడు పాలించే రోహిణి నక్షత్రం సమృద్ధి, సంతానోత్పత్తి, అభివృద్ధితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడికి ఇష్టమైన నక్షత్రం. ఇది ప్రేమ, సౌందర్యం, సృజనాత్మకతతో ముడిపడి ఉంటుంది. ఈ రోజున ఉదయం 10:54 గంటలకు రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో చేసే అన్ని కొనుగోళ్లు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.

* వాటిని కొనడం డేంజర్

అక్షయ తృతీయ చాలా శుభప్రదమైన రోజు, కానీ ఆ రోజు కొన్ని పనులు చేస్తే అశుభం కలుగుతుంది. ముఖ్యంగా పండుగ నాడు ప్లాస్టిక్, అల్యూమినియం, స్టీల్ వంటి లోహాలతో చేసిన వస్తువులు కొనకూడదు. ఈ వస్తువులు రాహువు ప్రభావంతో ఉంటాయని, ఇంట్లోకి నెగిటివిటీని తెస్తాయని నమ్ముతారు. అలాగే అక్షయ తృతీయ నాడు డబ్బులు అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లోని సంపద, శ్రేయస్సును మరో వైపు మళ్లించడానికి కారణమవుతుందని పండితులు చెబుతారు.

2024-04-25T12:17:31Z dg43tfdfdgfd