గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం

గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం

  •     ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకం 
  •     2 లక్షల మందికి పైగా రాక 
  •     15 కిలో మీటర్ల మేర ట్రాఫిక్​జామ్
  •     మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపివేత
  •     ఆలయ అర్చకులపై మహిళల ఆగ్రహం
  •     ఎండలో కనీస సౌలతులు లేక జనం ఇబ్బందులు.. చేతులెత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ టెంపుల్​లో గరుడ ప్రసాదం కోసం జనం పోటెత్తారు. ఆ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని సోషల్​మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో.. మహిళలు భారీగా తరలివచ్చారు. 

ఎర్రటి ఎండలో కిలో మీటర్ల దూరంలో తమ వాహనాలను నిలిపి.. కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. గుడి వద్ద కూడా దాదాపు కిలో మీటర్ మేర బారులు తీరారు. మరోవైపు ఆలయానికి పెద్ద సంఖ్యలో జనం వాహనాల్లో రావడంతో హైదరాబాద్–-బీజాపూర్ జాతీయ రహదారిపై సుమారు 10 నుంచి 15  కిలో మీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్​ అయింది. దీంతో హైదరాబాద్​సిటీతో పాటు జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ ను నియంత్రించడంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు చేతులెత్తారు. దీంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు నరకం అనుభవించారు.    

2 లక్షలకు పైగా తరలివచ్చిన జనం

ప్రతి ఏటా చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ధ్వజారోహణం అనంతరం గరుడ ప్రసాదం పంపిణీ చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఏ ఏడాది రానంత జనం ఈసారి తరలివచ్చారు. హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచీ  సుమారు 2 లక్షలకు పైగా వచ్చారు. అందులో గరుడ ప్రసాదం కోసం వచ్చిన మహిళలు లక్ష మంది వరకు ఉంటారు. కొందరు గురువారం సాయంత్రమే ఆలయానికి చేరుకుని ఆద్దె రూమ్ లలో ఉన్నారు. చాలా మంది శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు గరుత్మంతునికి పూజలు చేసి ధ్వజారోహణం పూర్తి చేసిన తరువాత  తెల్లవారుజామున 3.30 గంటలకు గరుడ ప్రసాదం పంపిణీ ప్రారంభించారు. 

సోషల్​మీడియాలో ప్రచారంతో పెరిగిన రద్దీ.. 

గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని గత నెల రోజుల నుంచి ఆలయ ఆర్చకులు సోషల్​మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫలితంగా ఆలయానికి వెళ్లే దారంతా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రతిరోజు ఆలయానికి సిటీ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. ఇంత దూరం వచ్చాము.. ఎలాగైనా ప్రసాదం తీసుకొనే వెళ్లాలని కిలో మీటర్ల  దూరం నుంచి మండుటెండల్లో మహిళలు నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. గుడికి చేరుకున్నాక అక్కడ కనీస వసతులు లేక ఇబ్బందులు పడ్డారు. గొంతు తడుపుకుందామన్నా మంచినీళ్లు లేకపోవడంతో భక్తులు నరకం అనుభవించారు. ఓవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు.  

ప్రసాదం దొరకక నిరాశతో వెనుతిరిగిన భక్తులు

వందల కిలో మీటర్లదూరం నుంచి గరుడ ప్రసాదం కోసం ఎంతో ఆశతో వచ్చిన కొందరు మహిళలకు ప్రసాదం దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. గరుడ ప్రసాదం కోసం సుమారు లక్ష మంది మహిళలు రాగా.. అందులో 30 వేల మందికి ప్రసాదం లభించింది. మద్యాహ్నం 12 , ఒంటి గంట తరువాత ప్రసాదం అయిపోయిందని అర్చకులు చెప్పడంతో 70 వేల మంది మహిళలు వెనుదిరిగి వెళ్లారు.

ఎర్రటి ఎండలో కిలో మీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ ఆలయానికి చేరుకునే సరికి ప్రసాదం అయిపోయిందని ఆర్చకులు చెప్పడంతో మహిళలు వారిపై మండిపడ్డారు. ప్రసాదం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు లేదని తిప్పి పంపితే ఎలా అని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్​ను క్లియర్ చేశామని సీఐ మొయినాబాద్ పవన్ కుమార్​రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్​ రెడ్డి కూడా బందోబస్తును పర్యవేక్షించారు.

ఒక్కరోజే ప్రసాద వితరణ: సీఎస్ రంగరాజన్, ఆలయ అర్చకులు

అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు గరుడ ప్రసాదం కోసం వచ్చారు. సాధారణంగా ప్రతి ఏడాది గరుడ ప్రసాదం 3 రోజుల వరకు ఇచ్చే ఆనవాయితీ ఉండేది. కానీ, ఈ ఏడాది ఒక్క రోజుతోనే ప్రసాద వితరణ పూర్తయింది. ఇక మళ్లీ గరుడ ప్రసాదం ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-20T01:01:03Z dg43tfdfdgfd