బోర్నవిటా: ఇది హెల్త్‌డ్రింక్ కాదా, ఈ-కామర్స్ సైట్స్ నుంచి దీనితోపాటు మరికొన్నిడ్రింక్స్‌ను తొలగించాలని కేంద్రం ఎందుకు చెప్పింది?

మీరేదైనా సూపర్ మార్కెట్‌కు వెళ్ళారనుకోండి. హెల్తీ డ్రింక్స్ పేరుతో అక్కడ అరలలో చక్కగా అమర్చిన అనేక డ్రింక్స్ కనిపిస్తాయి. వాటిని చూడగానే ఆరోగ్యానికి మంచిదనే భావనతో చాలామంది వాటిని కొంటుంటారు. మరి నిజంగా ఆ డ్రింక్స్ మీ ఆరోగ్యానికి మంచివేనా?

ఇటీవల ఈ-కామర్స్ కంపెనీలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

‘‘బోర్నవిటా సహా కొన్ని డ్రింక్స్‌ను ‘హెల్త్ డ్రింక్స్’ గా ఈ-కామర్స్ సైట్స్‌ లో చూపుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఎఫ్ఎస్ఎస్‌ యాక్ట్ 2006, ఎఫ్ఎస్ఎస్ఏఐ, బోర్నవిటా బ్రాండ్‌ను నడిపే మాండెలెజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జారీచేసిన నిబంధనలలో గానీ ఎక్కడా హెల్త్ డ్రింక్ నిర్వచనం లేని విషయాన్ని జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ తన విచారణలో తేల్చింది’’ అని ఆ సూచనలో పేర్కొంది.

ఈ-కామర్స్ కంపెనీలు, పోర్టల్స్ తమ ఫ్లాట్‌ఫామ్స్ పైన హెల్త్ డ్రింక్స్ విభాగం నుంచి బోర్నవిటా సహా అన్ని డ్రింక్స్, బెవరేజెస్‌ను తొలగించాలని ఆదేశించింది.

ఈ అంశంపై జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ అధ్యక్షుడు ప్రియాంక్ కనుంగో బీబీసీతో మాట్లాడారు. బోర్నవిటాలో నిర్ణీత మోతాదుకు మించి చక్కెర ఉందని, అయినా దానిని హెల్త్‌డ్రింక్‌గా అమ్ముతున్నారని, ఇది పిల్లల ఎదుగుదలకు మంచిదని చెపుతున్నారని కిందటేడాది ఓ ఫిర్యాదు అందిందని ఆయన చెప్పారు.

‘‘ఆ ప్రకటన తప్పుదోవ పట్టించేదే కాకుండా, పిల్లల క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోలేదు. మేం దీని గురించి సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలకు తెలిపాం. ఈలోగా బోర్నవిటా కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడాం. వారు తమది హెల్త్ డ్రింక్ కాదంటూ వారు లిఖితపూర్వకంగా తెలియజేశారు.’’ అని కనుంగో అన్నారు.

దీని తరువాత తాము ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఐ) అధికారులను కూడా సంప్రదించామని, ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్‌లో ఎక్కడా హెల్త్ డ్రింక్ గురించిన ప్రస్తావన లేదనే విషయాన్ని వారు తెలిపారని కనుంగో వెల్లడించారు.

దీనర్థం ఏ ఉత్పత్తి అయినా అది జ్యూస్ రూపంలో ఉన్నా, లేదంటే పౌడర్, ఎనర్జీ డ్రింక్ ఏదైనా హెల్త్ డ్రింక్ అనే పేరుతో అమ్మకూడదు.

కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏర్పాటైంది.

బోర్నవిటా తయారీ కంపెనీ మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌ను ఈ విషయంపై స్పందించాల్సిందిగా బీబీసీ సంప్రదించగా వారు నిరాకరించారు.

ఇవన్నీ కంపెనీలు చేస్తున్న మార్కెటింగ్ యుద్ధమని, అసలు హెల్త్ డ్రింక్ అనేదీ ఏదీ లేదని అన్నారు డాక్టర్ రాజీవ్ కోవిల్. ఆయన ముంబయిలోని డయాబెటిస్ కేర్ సెంటర్‌లో పని చేస్తారు.

ఈ-కామర్స్ సైట్లలో హెల్త్ డ్రింక్ పేరుతో అనేక పానియాలు కనిపిస్తుంటాయనీ, ప్రజలు వీటిల్లో ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు ఉన్నాయనుకుని కొంటుంటారని ఆయన చెప్పారు.

చక్కెర ఎంత ఉండాలి?

‘‘ఇండియాలో కేవలం 100 గ్రాముల పాకెట్లపైనే లేబుల్స్ ఉంటాయి. ఉదాహరణకు మీరేదైనా 100 గ్రామలు ఆహారం పాకెట్ ను తీసుకుంటే అందులో షుగర్ 10 గ్రాములకంటే తక్కువ ఉండాలి. ఐదు గ్రాముల కంటే షుగర్ తక్కువ ఉంటే అప్పుడు దానిని లో-షుగర్‌గా పిలుస్తారు. ఒకవేళ అది 0.5 అయితే దానిని షుగర్ ఫ్రీగా పిలుస్తారు. ఈ డ్రింక్స్ అన్నింటిలోనూ చక్కెరతోపాటు కార్న్ సిరప్ లాంటి కార్బో హైడ్రేట్స్ కూడా ఉంటాయి.

ఈ డ్రింక్స్ లేదా పౌడర్లు ఎక్కువ మొత్తంలో చక్కెరను కలిగి ఉంటున్నాయని, పిల్లలకు చక్కెర తీసుకోవాల్సిన అవసరమే ఉండదని, కానీ కంపెనీలు దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదని ప్రియాంక్ కనుంగో చెప్పారు.

ఎంత చక్కెర తీసుకోవాలి

‘‘హెల్త్ డ్రింక్స్ పేరుతో వీటిని ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. వీటి విషయంలో ఏళ్ళ తరబడి ప్రకటనలు, మార్కెటింగ్ ద్వారా తప్పుదోవపటిస్తున్నారు.’’ అని డాక్టర్ అరుణ్ గుప్తా చెప్పారు. గుప్తా చిన్నపిల్లల వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఆయన న్యూట్రిషన్ అడ్వకసీ పబ్లిక్ ఇంట్రెస్ట్ (ఎన్ఏపీ) అనే థింక్ టాంక్ కు కన్వీనర్ కూడా.

‘‘హెల్త్ డ్రింక్‌లు అంటే ఏమిటో నిర్వచించలేదని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు ఇలాంటి వాటిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అసలు ఆరోగ్యకరమైన పానీయం, ఆహారం అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం ఉండాలి’’ అని ఆయన చెప్పారు.

డాక్టర్ రాజీవ్ కోవిల్, డాక్టర్ అరుణ్ గుప్తా మాట్లాడుతూ ‘‘సిగరెట్లు తాగడానికి అలవాటుపడినట్టే పిల్లలు లేదంటే పెద్దలు ఇలాంటి చక్కెరను తినడానికి అలవాటుపడిపోతారు. ఎందుకంటే ఇది కూడా ఆనందంలాంటి భావనను అందిస్తుంది.’’ అని అన్నారు.

పంచదార ఉన్న డ్రింక్స్ ను తాగడానికి ఎవరు బాగా అలవాటు పడతారో వారిలో నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని అర్థం. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేది ఎలాంటి ఇన్ఫెక్షన్ వల్ల రాదు. కానీ అనారోగ్యానికి కారణమవుతుంది.

బరువు పెరగడం, స్థూలకాయులుగా మారడం, వీటివల్ల డయాబెటి స్ రావడంలాంటివన్నీ వీటివల్ల వచ్చేవే.

బిస్కెట్లలో పంచదారతోపాటు ఉప్పు కూడా ఉంటుంది. జ్యూస్ లేదంటే ఎనర్జీ డ్రింకులలో పెద్ద మొత్తంలో చక్కెర ఉంటుంది. పైగా ఇవ్వన్నీ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కిందకు వస్తాయి.

ఇలాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాదు, ఆయుర్దాయాన్ని కూడా తగ్గిస్తాయని బ్రిటీష్ మెడికల్ జర్నల్ ఇటీవల ఓ రిపోర్టులో తెలిపింది.

‘‘మీ రోజువారీ ఆహారంలో 10% మించి ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటే, డయాబెటిస్, క్యాన్సర్, హార్ట్ ఎటాక్, డిప్రెషన్ తదితర జబ్బులకు కారణమవుతుంది. ఇలాంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు రోజురోరోజుకు పెరుగుతున్నాయి. పానీయాలు, ఆహారాలకు సంబంధించి చేసే ప్రచారాలలో, వాటిల్లో ఎంతమొత్తం పంచదార లేదంటే ఉప్పు ఉందో చెప్పాలి. తక్కువ చక్కెర ఉత్పత్తులను నిర్వచించారు కానీ, అధిక చక్కెర ఉత్పత్తుల గురించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు’’ అని డాక్టర్ గుప్తా చెప్పారు.

ఎటువంటి సమాచారం ఇవ్వని ప్రకటనలను అరికట్టడం ద్వారా, ఆయా ఉత్పత్తుల కొనుగోలు కూడా తగ్గుతుందని తెలిపారు.

ప్రజలు చైతన్యవంతులు కావాలని డాక్టర్ అరుణ్ గుప్తా, డాక్టర్ రాజీవ్ కోవిల్ అన్నారు. ప్రజలలో చాలామంది ఫుడ్ లేబుల్స్ చదవలేరని చెప్పారు. ఇలాంటి వారికి ట్రాఫిక్ కలర్ కోడింగ్ తరహాలో అవగాహన కలిగించాలన్నారు. అలాగే ఎక్కువ స్థాయిలో పంచదార, ఉప్పు, కొవ్వు కలిగిన ఉత్పత్తులపై గట్టి హెచ్చరిక చేయాలన్నారు.

అలాంటి ఉత్పత్తులపై ఎక్కువగా పన్నులు వేయడం ద్వారా, రుచి కోసం వాటిని కొనుగోలు చేయాలనుకునే ప్రజలు వాటిని కొనకుండా చేయవచ్చన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-04-19T12:08:58Z dg43tfdfdgfd