రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు

రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు

  •     సీతారాముల కల్యాణానికి హాజరైన లక్షదాకా జనం  
  •     ఆకర్షణగా నిలిచిన శివ పార్వతులు, జోగినులు, హిజ్రాలు 
  •     వైభవంగా రథోత్సవం

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణం తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఆలయ చైర్మన్​గెస్ట్​హౌస్​ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై ఆలయ స్థానాచార్యులు శ్రీ అప్పాల భీమాశంకర్​శర్మ , ప్రధాన అర్చకులు శరత్​శర్మ, ఇతర అర్చకులు పెండ్లి తంతును ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు సీతారాముల మూలవిరాట్​కు పూజలు నిర్వహించి..ఉత్సవ మూర్తులను ఎదుర్కోళ్లతో కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఆలయం తరపున ఈవో కృష్ణ ప్రసాద్ దంపతులు స్వామివారికి  పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.  మున్సిపాలిటీ తరపున​మున్సిపల్​కమిషనర్​అన్వేష్​ పట్టుబట్టలు పెట్టారు. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి హాజరైన శివపార్వతులు, జోగినులు జంటలుగా ఏర్పడి కల్యాణం చేసుకున్నారు. చేతిలో త్రిశూలంతో ఒకరిపై మరొకరు తలంబ్రాలు పోసుకునే కార్యక్రమం కనులపండువగా సాగింది. కల్యాణం తర్వాత రథోత్సవం వైభవంగా నిర్వహించారు. 

సీతా రామచంద్రులు, పార్వతీ రాజేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పట్టణ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో శివపార్వతులు, హిజ్రాలు, జోగిల నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాత్రి ఆలయంలోని అద్దాల మంటపంలో సీతారామచంద్రస్వామి, రాజరాజేశ్వరస్వామివారలకు ప్రత్యేక పూజలు నిర్వహించి డోలోత్సవం నిర్వహించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భక్తులకు మజ్జిగ, వాటర్​ ప్యాకెట్లు అందజేశారు. అన్నదానం నిర్వహించారు. దూరం నుంచి కల్యాణం కనిపించని భక్తుల కోసం ఎల్​ఈడీ స్క్రీన్స్​ఏర్పాటు చేశారు. వేములవాడ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ అది శ్రీనివాస్​, జిల్లా ఎస్పీ అఖిల్​మహాజన్, మున్సిపల్​చైర్​పర్సన్​రామతీర్థపు మాధవి, వైస్​ చైర్మన్​ బింగి మహేశ్​పాల్గొన్నారు. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-18T01:45:21Z dg43tfdfdgfd