రోజూ స్నానం చేయడం మంచిది కాదా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

ఏంటి ఇంకా స్నానం చేయలేదా.. టైమ్ 9 అయిపోతోంది. ఇంకెప్పుడు చేస్తావ్? అని అమ్మ అడుగుతుంటే.. అసలు రోజూ స్నానం చేయడమెందుకని మీకెప్పుడైనా అనిపించిందా? నిజంగా స్నానం శారీరక శుభ్రత కోసం చేస్తున్నామా, లేక సమాజానికి భయపడి చేస్తున్నామా?

స్నానం కచ్చితంగా చేయాల్సిన అవసరం కంటే సామాజిక ఒత్తిడే ఎక్కువ ప్రభావం చూపుతోందని కొంతమంది నిపుణులు నమ్ముతున్నారు.

ప్రతిరోజూ స్నానం చేయడానికి నేను కొన్నేళ్ళ కిందటే స్వస్తి పలికాను.

కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంటినుంచే పనిచేయాల్సి రావడం, నాకంటే తక్కువసార్లు స్నానం చేసే భాగస్వామితో ఉండటం, మధ్య వయసు బద్ధకం కలిసి మూడుదశాబ్దాల నా అలవాటుకు స్వస్తి పలికేలా చేశాయి.

నేను వ్యాయామాలు చేయనంత కాలం వారానికి మూడుసార్లు మాత్రమే స్నానం చేస్తాను.

కొంతమంది నా స్నేహితులు నాకంటే తక్కువగానూ, మరికొందరైతే చలికాలంలో వారానికొసారి, తడిజుట్టు ఇష్టంలేనివారు అప్పడప్పుడు మాత్రమే స్నానం చేస్తారు.

కొంతమంది మాత్రం ఈ అలవాటుతో మమేకం కాలేకపోయారు.

‘‘పొద్దున్నే స్నానం చేయకపోతే నాకు రోజు సరిగా గడవదు’’ అంటారు వారు.

‘‘స్నానంతోనూ, కప్పు టీతోనూ రోజు మొదలవుతుంది. అయినా లండన్‌లో ప్రయాణం చేశాకా స్నానం చేయకుండా మంచం మీదకు చేరడమా, పైగా వారానికి మూడుసార్లు స్నానమా, యాక్.. అంటుంటారు.

ఓటేస్తే ఉచితంగా రెస్టారెంట్ ఫుడ్, బీర్, ట్యాక్సీ రైడ్, కాఫీ.. ఇలాంటి కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చర్మం పొడిబారుతుందా?

అమెరికాలో అప్పుడప్పుడు స్నానం చేసేవారిని అనుమానాస్పదంగా చూస్తారు.

ఈ అనుమానపు చూపులు సెలబ్రిటీలకు కూడా తప్పడం లేదు.

కిందటి నెల బ్రిటీషు టీవీ ప్రజెంటర్ జోనాథన్ రోస్, తాను కొన్నిసార్లు వారానికి ఒకసారి కూడా స్నానం చేయనని చెప్పినందుకు హెడ్‌లైన్స్‌లో నిలిచారు.

2023లో అమెరికా ఫెర్రెరా అనే నటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అప్పడప్పుడు స్నానం ఎగ్గొడతానని చెప్పి తను నటించిన బార్బీ సినిమాలోని సహనటులను ఆశ్చర్యానికి గురిచేశారు.

2021లో నటుడు అస్టన్ కుచర్ తనకు స్నానమంటే చంకలు, తొడలను శుభ్రం చేసుకోవడమేనంటూ వ్యాఖ్యతలను భయపెట్టడం, దీంతోపాటు ఆయన సహ నటుడు జేక్ గిలెన్హాల్ స్నానం అంత ప్రాముఖ్యమున్న విషయం కాదని చెప్పినప్పుడు ఓ చిన్న దుమారమే రేగింది.

ఇదెంత దూరం వెళ్ళిందంటే తరువాత జాసన్ మెమోవా, ది రాక్ లాంటి నటులు తాము చాలాసార్లు స్నానం చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది.

సూక్ష్మక్రిములు వ్యాపించకుండా తరచూ చేతులు కడుక్కోవడం కీలకమైనప్పటికీ, ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల ఎటువంటి శారీరక ఆరోగ్య ప్రయోజనాలు రావని వైద్యులు చెబుతున్నారు.

నిజానికి ఇది మీ చర్మాన్ని పొడిబారేలా చేయడమే కాక, మీ రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరిచి మీకు నష్టం కలగచేస్తుందని చెబుతున్నారు.

అమెరికన్లు, బ్రిటీషర్లు ఇప్పటికీ ప్రతిరోజూ స్నానం చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందా?

12 ఏళ్ళనుంచి స్నానానికి స్వస్తి

స్నానం చేయమని చెప్పడానికి ఇష్టపడే వ్యక్తులను కనిపెట్టడం అతి తేలిక కాదు.

2015లో కెమిస్ట్ డేవిడ్ విట్‌లాక్ తాను 12 ఏళ్ళ నుంచి స్నానం చేయడంలేదని చెప్పి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. స్నానానికి బదులుగా ఆయన మంచి బ్యాక్టిరీయాను శరీరంపై స్ప్రే చేసుకునేవారు. అలాగే తత్త్వశాస్త్రం ఆధారంగా చర్మసంరక్షణ బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు.

ఏడాది తరువాత ఫిజిషియన్ జేమ్స్ హాంబ్లిన్ తాను స్నానం ఎలా మానేసిందీ రాశారు. 2020లో ఆయన పుస్తకం క్లీన్: ది న్యూ సైన్స్ ఆఫ్ స్కిన్ అండ్ ది బ్యూటీ ఆఫ్ డూయింగ్ లెస్’ విడుదలైనప్పుడు బీబీసీతో మాట్లాడారు. ‘ నా దగ్గర ఒక వాసన వస్తుంటుంది. అది గుర్తించేలా ఉందని నా భార్య చెబుతుంటుంది. కానీ ఆమె దానిని ఇష్టపడుతుంది. మిగతవాళ్ళుకూడా పెద్దగా ఇబ్బంది లేదని చెప్పారు.

వారానికి మూడుసార్లు మాత్రమే స్నానం చేసే నా అలవాట్లను ప్రస్తావిస్తూ నేను ఆయన ఇంటర్వ్యూ కోసం ఓ మెయిల్ పంపాను. కానీ తాను చాలా బిజీగా ఉన్నానని చెబుతూ ‘‘మిమ్మల్ని హేళన చేసేవారికి వారు చర్మ సూక్ష్మజీవులకు సంబంధించిన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నట్టు చెప్పండి’’ అని తెలిపారు.

ఎట్టకేలకు నేను నాలానే ప్రతిరోజూ స్నానం చేయని పర్యావరణ వేత్త డోనాచాడ్ మెక్‌కార్తీని కలిశాను. ప్రతిరోజూ స్నానం చేయని విషయంలో నేను ఒంటరిని కాను కానీ, ఆ విషయం గురించి ధైర్యంగా మాట్లాడటంతో నేను ఒంటరిని’’ అని ఆయన చెప్పారు.

ఎనిమిదేళ్ళ కిందట మెక్ కార్తీ గార్డియన్ లో ఒక వ్యాసం రాశారు. అందులో తాను సింక్ లో చేసే వారపు స్నానాల గురించి రాశారు. అలా అరాకొరా స్నానం చేయడం వల్ల తిట్లు, హేళనల వరదను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన భయపడ్డారు. కానీ వ్యాసం ప్రచురితమయ్యాక చాలామంది ప్రజలు తాము కూడా అలానే చేస్తామని ఆయన చెవిలో గుసగుసలాడారు.

కప్పునీటితో గడ్డం

గాయానికి గురయ్యేవరకు మెక్‌కార్తీ ఓ ప్రొఫెషనల్ బెల్లీ డాన్సర్, ఆయన స్నానపు అలవాట్లు సాధారణంగానే ఉండేవి. కానీ అమెజాన్ అడవిలో యానోమమి ప్రజలతో రెండు వారాలు గడిపిన తరువాత, తనవంతుగా పర్యావరణానికి ఏమైనా చేయాలని భావించారు.

ఇందులో భాగంగా తన లండన్ నివాసంలో వాన నీటి సంరక్షణ, సోలార్ థర్మల్ హాట్ వాటర్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే తన నీటి వినియోగాన్ని గమనించడమూ మొదలుపెట్టారు. ఇలా ఏళ్ళ గడిచాకా ఆయన ప్రతిరోజు స్నానం చేయడాన్ని తగ్గించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆయన నెలకోరోజు స్నానం చేస్తున్నారు. ఆయన తన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఓ క్లాత్‌ను వాడతారు. ఒక కప్పు నీటితో గడ్డం చేసుకుంటారు. ఆయన కంపు కొడుతున్నారని ఎవరూ చెప్పడం లేదు.

స్నానం అలవాటుగా మారిందా?

2005లో వచ్చిన నివేదిక స్నానంపై పరిశోధన చేసే వారికి ఓ బెంచ్‌మార్క్‌గా ఉంది. బ్రిటన్ ప్రజలు రోజుకోసారి, కొన్నిసందర్భాలలో రెండుసార్లు స్నానం చేయడం సాధారణమని ఆ రిపోర్టు తెలిపింది. ఇదో సాధారణమైన విషయంగా మారింది. రోజుకోసారి కూడా స్నానం చేయకపోవడమనేది సామాజికంగా, శారీరకంగా అసౌకర్యానికి గురిచేస్తుంది అని ఆ నివేదికలో పేర్కొన్నారు.

‘‘మనం గతంలో కంటే ఇప్పడు ఎక్కువగా శరీరాన్ని రుద్దేస్తున్నాం..ఈ మార్పు గత వందేళ్ళ నుంచే మొదలైంది. ఇది ఎవరూ ప్రణాళికాబద్ధంగా చేసింది కాదు. ఇదేదో అనుకోకుండా అలా జరిగిపోయినట్టు కనిపిస్తోంది’’ అని చెప్పారు డేల్ సౌథార్టన్. ఆయన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో సోషియాలజీ కన్జంప్షన్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

సాధారణం ప్రజలు స్నానం ద్వారా తమను తాము శుభ్రపరుచుకుంటారు. మీరు స్పా కేంద్రాలలో హీలింగ్ వాటర్స్ లో స్నానం చేయడం నుంచి, నీటి తొట్టెలలో ఓ గ్లాసు వైనో, లేదో కప్పుటీనో, పుస్తకంతోనో స్వాంతన పొందే ఆధునిక పద్ధతి వరకూ స్నానం చుట్టూ ఉన్న సంస్కృతి గొప్పది.

(అయితే వీటిల్లో ఏ స్నానం తక్కువ నీటి వినియోగాన్ని కలిగి ఉంటుంది, ఏది చౌకైనది, ఏది పర్యావరణ అనుకూలమైనది అంటే అంటే అది మీ స్నానానికి పట్టే సమయంపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది షవర్ స్నానం ఆరోగ్యకరమైనదని, అది మురికిని పోగొడుతుందని చెపుతుంటే మరికొందరు ఇలాంటి తేడాలు చాలా స్వల్పమంటారు. )

ఇకపై స్నానం చేయమా?

1950 లో బ్రిటిషర్లకు పైపుల ద్వారా బాత్రూమ్‌లలో నీరు రావడం మొదలైంది. దీని తరువాత కొళాయిలకు జల్లెడ బిగించడమనే ఆవిష్కరణతో షవర్ లు వచ్చాయి. ఇప్పుడు అనేక ఇళ్ళు, విద్యార్థుల హాళ్ళను ఎటాచ్డ్ బాత్రూమ్స్ ఉండేలా నిర్మిస్తున్నారు. ఐదుగురు కుటుంబసభ్యులుండే ఇంట్లో ఒకే షవర్ ఉంటే అది షవర్ తక్కువ వాడేలా చేస్తుంది.

అదే మీరు మీ మంచంపైనుంచి ఒక్క ఉదుటున మీ ప్రైవేటు షవర్ కిందకు చేరారునుకోండి మీరు ఎక్కువ నీటిని వాడతారు. ఒకనాడు మనం శుభ్రంగా స్నానం చేయడానికి వీలుగా ఈ షవర్లను బిగించారు. కానీ ఇప్పుడు దానర్థం మనం ఎక్కువగా స్నానం చేయడానికన్నట్టుగా మారిపోయిందని సౌథార్టన్ వివరించారు.

అయితే స్నానానికి కూడా వ్యాపార సూత్రాలు కొత్త అర్థాన్ని చెప్పాయి. 1900వ దశకంలోని వ్యాపార ప్రకటనలు బాత్రూమ్‌లకు కొత్త చిహ్నాలను జోడించాయి.

అప్పట్లో షవర్ స్నానం సమయాన్ని ఆదాచేయడానికి, పునరుత్తేజం కోసం ఒక సాధనంగా మార్కెట్ ప్రపంచపం చూపించిందని సౌథార్థన్ వివరించారు.

ఇక 1970 నాటికి తలస్నానంతో కూడిన చిత్రాలతో ప్రకటనలు చాలా సాధారణంగా ఉండేవి.

అయితే 1980 నాటికి ఆవిరినీటితో సేదతీరుతున్న మహిళా చిత్రాలను చూపేవారు. స్నానం చేయడం ఓ సేదతీరే చర్యగా మారిపోయింది.

మనం వందేళ్ళు వెనక్కి వెళితే అప్పట్లో ప్రతిరోజూ స్నానం చేసేవారు కాదు. ఎందుకంటే అప్పుడు షవర్ ఓ సాధారణమైన విషయం కాదు అని ప్రొఫెసర్ క్రిస్టెన్ గ్రామ్ హన్సెన్ వివరించారు. ఆయన డెన్మార్క్‌లోని అల్‌బోర్గ్ యూనివర్సిటీలో బిల్డ్ ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ‘‘ మనం ఆరోగ్యం కోసం స్నానం చేయడం లేదు. అదో సాధారణమైన చర్య కాబట్టి చేస్తున్నాం’’ అని వివరించారు.

కొన్ని సందర్భాలలో అంటే ట్రెక్కింగ్ హాలిడేస్, లేదా సంగీత ఉత్సవాలు తదితర సమయాలలో స్నానానికి సంబంధించి భిన్నమైన నియమాలను అంగీకరిస్తామని, అలాంటి సమయాలో స్నానం చేయకపోయినా పర్లేదు అనే విషయాన్ని ఒప్పుకుంటామని ఆమె తెలిపారు.

భవిష్యత్తులో ఏం జరగనుంది? మనందరం షవర్ స్నానాలను వదిలేస్తామా? అలాంటిదేమీ ఉండకపోవచ్చు. పర్యావరణ కారణాల కోసం ప్రజలు స్నానం చేయడాన్ని ఆపేసే పరిస్థితులు లేవని విద్యావేత్తలు చెబుతున్నారు. స్నానానికి సంబంధించిన నిబంధనలు మన సమాజంలో ఇంకిపోయాయంటారు సౌథార్టన్

‘‘నేను అప్పుడప్పుడు స్నానం చేయడమనేది కొంతమందికి ప్రత్యేకంగా కనిపించవచ్చు. మనమెందుకు స్నానం చేస్తున్నాం? ఎవరైనా ఏమైనా అనుకుంటారనో, లేదంటో కంపు కొడతామనే భయంతోనో.. కానీ నేను ఆ భయాన్ని ఎదుర్కొన్నాను. నేను జీవిస్తున్నాను’’

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-04-25T11:37:26Z dg43tfdfdgfd