శ్రీకృష్ణుడితో యువతికి వివాహం.. బృందావన్‌ నుంచి ఊరేగింపుగా వచ్చిన వరుడు

చిన్నతనం నుంచి శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ పెరిగిన ఓ యువతి.. చివరకు ఆ భగవానుడ్నే తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తమ కుమార్తె నిర్ణయంపై ఆందోళన చెందారు. అది అసాధ్యమని ఆమెను వారించారు. కానీ, యువతి మాత్రం తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని ఒప్పించింది. చివరకు బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా శ్రీకృష్ణుడ్ని వివాహం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నగరం న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీలో నివసించే శివాని పరిహార్‌ (23)కు ఏప్రిల్ 18న కృష్ణుడితో పెళ్లి జరిగింది. వేదమంత్రాల సాక్షిగా ఆ భగవంతుడ్ని తన భర్తగా చేసుకుంది.

సంప్రదాయం ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా నిర్వహించారు. వరుడు శ్రీకృష్ణుడి విగ్రహం బృందావన్‌ నుంచి బాజాభజంత్రీలు, మేళతాళలతో ఊరేగింపుగా వచ్చి... కళ్యాణ మండపంలో ఆశీనుడయ్యారు. స్థానిక ఆలయంలో శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. పెళ్లి క్రతువు ముగిశాక శివానీకి వివాహ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను కూడా అధికారులు అందజేయడం గమనార్హం. అనంతరం వరుడితో (శ్రీ కృష్ణుడి విగ్రహం) వధువు బృందావనానికి బయలుదేరి వెళ్లింది. తన జీవితాంతం బృందావనంలోని రాధాధ్యాన్‌ ఆశ్రమంలో శ్రీ కృష్ణుని సేవలో ఆమె తరించనుంది.

ఈ పెళ్లి విషయంలో మొదట్లో తాము సంశయించినా, శివానీ పట్టుదల చూసి అంగీకరించినట్లు ఆమె తల్లి మీరా పరిహార్‌ తెలిపారు. ఇక, తన నిర్ణయం గురించి శివాని మాట్లాడుతూ.. లడ్డూ గోపాల్‌ని పెళ్లి చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచి కల అని చెప్పింది. ‘స్వామి తరచుగా నా కలలలోకి వచ్చేవారు.. భగవాన్‌తో వివాహం జరిగినట్టు అనిపించేది.. ప్రస్తుతం అది నిజమైంది.. నా జీవితమంతా కృష్ణుడికి అప్పగించాను. నాకు ఎవరి ఇంటికి వెళ్లాలని లేదు.. ఈ దేహాన్ని మనకు అందించింది ఆయనే. ఇప్పుడు నా జీవితమంతా అతనికి అప్పగిస్తాను’ అని ఆమె చెప్పింది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటి రోజు ఏప్రిల్ 16న హల్దీ, 17న బారాత్, 18న పెళ్లి, అప్పగింతలు కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 250 మందికిపైగా అతిథులు ఈ వివాహానికి హాజరయ్యారు.

ఈ పెళ్లి అచ్చం 16 వ శతాబ్దం నాటి మీరాబాయి కథను గుర్తుకు తెస్తుంది. రాజస్థాన్‌కు చెందిన మీరాబాయి.. శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ, కీర్తిస్తూ ఆమె రచించి, గానం చేసిన భజనలు ఎన్నో ఉన్నాయి. ఓ రాజకుటుంబంలో జన్మించిన మీరాకు.. చిన్నతనంలో రాయ్ దాస్ అనే యోగి శ్రీకృష్ణ విగ్రహం కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ విగ్రహమే తోడుగా జీవితం గడిపేది. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే సజీవంగా ఆ విగ్రహం రూపంలో ఉన్నాడని భావించేది. చిత్తోర్ యువరాజుతో వివాహం జరిగినా.. శ్రీకృష్ణుడిపై భక్తి రోజురోజుకూ మీరాలో ఎక్కువైంది. భగవంతుని గుణగానలను నంకీర్తన చేస్తూ, భక్తి పారవశ్యంతో నర్తిస్తూ చివరకూ ఆయనలోనే ఐక్యమైంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T02:12:31Z dg43tfdfdgfd