సమ్మర్‌లో ఈ ఆహారాలు అసలు తినకండి.. డీహైడ్రేషన్‌‌‌ను పెంచుతుంది..

ఈ వేసవి సీజన్ ప్రారంభం నుంచి ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కపోత, వడగాలుల తీవ్రత పెరిగింది. వేసవిలో ఎండల తీవ్రతకు డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, వడదెబ్బ రిస్క్ అధికంగా ఉంటుంది. వీటి ముప్పు తప్పించుకోవాలంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. అందుకు కొన్ని సమ్మర్ డ్రింక్స్, ఫ్రూట్స్ జ్యూస్‌లు తాగాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలకు వేసవిలో దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా డీహైడ్రేషన్‌కు, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇంతకీ ఆ ఆహారాలు ఏవంటే..?

* వేయించిన ఆహారాలు

సమ్మర్‌లో ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఫ్రైఫుడ్స్ అలసట, వికారం వంటి లక్షణాలను కలగజేస్తాయి. చర్మంలో అధిక జిడ్డును ప్రేరేపించి మొటిమలు ఏర్పడటానికి కారణమవుతాయి.

* స్పైసీ ఫుడ్స్

వేసవిలో మసాలాలు, కారంతో చేసిన స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి పిత్త దోషాలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి, శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఫలితంగా అధిక చెమటతో శరీరంలోని పోషకాలు నశిస్తాయి. బయట వేడి వాతావరణం, శరీరంలో వేడితో వడదెబ్బ ముప్పు పెరుగుతుంది.

* శుద్ధిచేసిన ఆహారాలు

వేసవిలో ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకపోవడం మంచిది. సాధారణంగా వేడిచేసి, పాశ్చరైజ్ చేసి, క్యాన్‌లో ఉంచి, ఎండబెట్టి, డీహైడ్రేట్ చేసి ప్యాక్ చేసిన పదార్థాలను ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. వీటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వీటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇవి బాడీ హీట్ పెంచుతాయి. నీటి నిలుపుదలకు కారణం అవుతూ, బాడీ డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు.

* కాఫీ

వేసవిలో కాఫీ తాగకపోవడం మంచిది. కాఫీలో ఉండే కెఫిన్, శరీరంలోని అదనపు ద్రవాలు కోల్పోయేలా చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. కెఫినేటెడ్ డ్రింక్స్ తాగితే శరీరం ద్రవాలను కోల్పోయేలా తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వేసవిలో కాఫీ శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతుంది. ఇది చర్మ సంబంధ సమస్యలకు కారణం కావచ్చు. అందుకే ఈ సీజన్‌లో కాఫీ మానేడం మంచిది, లేకపోతే మితంగా తాగాలి.

* సోడాలు, కోలాలు

వేసవిలో సోడాలు, కోలాలు, కూల్‌డ్రింక్స్‌కు డిమాండ్ ఉంటుంది. ఇవి తాగినప్పుడు శరీరానికి కూలింగ్ అనుభూతి వస్తుంది. అయితే వీటిలో ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి. అదేపనిగా తాగితే, ఇవి శరీరంలో వేడిని పెంచి డీహైడ్రేషన్‌ బారిన పడవచ్చు. అలాగే దంతక్షయం, బరువు పెరగడం వంటి ఇతర సమస్యల రిస్క్ పెంచుతుంది.

సమ్మర్‌లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలంటే ఈ ఆహారాలు మానేయడంతో పాటు హెల్తీ డ్రింక్స్ తాగాలి. పుచ్చకాయ, కర్భూజ వంటి సమ్మర్ ఫ్రూట్స్ తినాలి. మజ్జిగ, పుదీనా రసం, ఇతర హెల్తీ డ్రింక్స్ తాగితే, వీటిలో ఉండే వాటర్ కంటెంట్ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీంతో హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది.

2024-05-08T11:22:36Z dg43tfdfdgfd