స్కూలులో పిల్లల ముందే తన్నుకున్న మహిళా ప్రిన్సిపల్, టీచర్.. కారణం ఏంటో తెలుసా?

స్కూలు అంటేనే విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం, మంచి నడవడిక నేర్పించే దేవాలయం లాంటింది. ఇక అందులో పనిచేసే ఉపాధ్యాయులపై.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే అలాంటి ఉపాధ్యాయులే తమ విధులు మరిచి ప్రవర్తించారు. పిల్లల ముందే కొట్టుకున్నారు. పక్కనే ఉన్న మిగితా టీచర్లు, సిబ్బంది ఆపేందుకు ప్రయత్నం చేసినా వినకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్కూలు అంటే పిల్లలు కొట్టుకోవడం లేదా టీచర్లు పిల్లలను కొట్టడం చూశాం గానీ ఇలా ఓ టీచర్, ప్రిన్సిపల్ కొట్టుకోవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది.

విద్యార్థులకే పాఠాలు చెప్పే టీచర్, ప్రిన్సిపల్ కొట్టుకుంటే.. అక్కడ ఉన్నవారు చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు. మే 3 వ తేదీ శుక్రవారం రోజున ఆగ్రాలోని ఓ పాఠశాలకు చెందిన గుంజా చౌదరి అనే టీచర్ స్కూలుకు కొంచెం ఆలస్యంగా వచ్చింది. అయితే ఎందుకు లేట్ అయిందని పాఠశాల ప్రిన్సిపల్.. ఆ టీచర్‌ను ప్రశ్నించింది. దానికి ఆ టీచర్ వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో ప్రిన్సిపల్‌కు కోపం వచ్చింది. గత కొన్ని రోజులుగా ప్రిన్సిపల్ కూడా పాఠశాలకు లేట్‌గా వస్తున్నారని.. ప్రిన్సిపల్‌తోనే గుంజా చౌదరి చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

గుంజా చౌదరి, ప్రిన్సిపల్ మధ్య మాటల ఘర్షణ కాస్త చేతల వరకు వెళ్లింది. దీంతో వారిద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. ముఖంపై దాడి చేసుకున్నారు. అయితే అక్కడే ఉన్న తోటి టీచర్లు, ఇతర స్కూలు సిబ్బంది వారిని ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా ఆగకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఆ తర్వాత ఇదే ఘటనపై ప్రిన్సిపల్, టీచర్ ఇద్దరు స్థానికంగా ఉన్న సికంద్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలకు బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఇలా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. పిల్లల ముందే ఇలా చేస్తుంటే.. వారు ఇలాంటివే నేర్చుకుంటారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. చదువు చెప్పే టీచర్లే.. శాంతంగా కూర్చొని మాట్లాడుకోకుండా ఇలా కొట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఉన్నతాధికారులు కూడా తెలియడంతో రంగంలోకి దిగి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T10:29:30Z dg43tfdfdgfd