స్వస్తిక్ అంటే అర్థం ఏంటీ.. ఈ గుర్తు ఎందుకు అంత శక్తివంతమైనదో తెలుసా..

మత చిహ్నాలు (Religious symbols) అన్ని మతాలలో ముఖ్యమైనవి. ప్రతి రిలీజియస్ సింబల్ ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. హిందూ మతంలో పద్మం, రుద్రాక్ష, తిలకం, విభూతి, శివలింగం, ఓం, శ్రీచక్ర యంత్రం వంటి అనేక మత చిహ్నాలు ఉన్నాయి. వీటిలో స్వస్తిక్‌ (Swastik)ను ఎంతో శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఈ సింబల్ ప్రాచీన కాలం నుంచి హిందూ ఆచారాలలో విస్తృతంగా వాడుకలో ఉంది. అత్యంత ప్రసిద్ధ, శుభప్రద చిహ్నాలలో ఒకటిగా ఇది నిలుస్తోంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు, ఇంటి గృహప్రవేశం సమయంలో, పెళ్లి పత్రికలపై స్వస్తిక్ గుర్తు వేస్తారు. ఓంకారం తర్వాత అత్యధిక ప్రాముఖ్యత కలిగిన చిహ్నాలలో స్వస్తిక్ ముందు వరుసలో నిలుస్తుంది.

* స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత

"స్వస్తిక్" అనే పదం సంస్కృత పదం "స్వస్తిక" (Svastika) నుంచి వచ్చింది. ఈ పదాన్ని విశ్లేషిస్తే.. స్వస్తిక్ అర్థం "ఇది", "మంచి ఉనికి", "శుభం", "శ్రేయస్సు" అనే అర్థాలు వస్తాయి. ఈ గుర్తు శుభం, శ్రేయస్సు, ఆధ్యాత్మికతతో సంబంధం కలిగి ఉంటుంది. హిందూ మతం, బౌద్ధం, జైనమతం వంటి అనేక మతాలలో స్వస్తిక్ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు.

* స్వస్తిక్ నాలుగు శాఖల ప్రాధాన్యం

స్వస్తిక్ నాలుగు శాఖలు దైవత్వానికి సంబంధించిన నాలుగు ప్రధాన సూత్రాలను సూచిస్తాయి. ఈ గుర్తు లాగానే బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు ఉంటాయి. బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతో నలు దిక్కులా దైవజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తాడు. అలానే నాలుగు వేదాలను స్వస్తిక్ నాలుగు శాఖలు సూచిస్తాయి. అవి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం.

పురుషార్థాలు కూడా నాలుగు ఉన్నాయి. అవే ధర్మం (పవిత్ర కర్తవ్యం లేదా నైతికత), అర్థం (సంపదను పొందడం), కామం (వాంఛలను తీర్చుకోవడం), మోక్షం (జీవిత మరణ చక్రాల నుంచి విముక్తి). వీటిని కూడా స్వస్తిక్ గుర్తు చేస్తుంది. జీవితంలో నాలుగు దశలు ఉన్నాయి. వాటిలో బ్రహ్మచర్యం (విద్యార్థి జీవితం), గృహస్థాశ్రమం (గృహస్థు జీవితం), వానప్రస్థం (అడవి జీవితం), సన్యాసం (తపస్సు జీవితం). ఇవి కూడా స్వస్తిక్ నాలుగు శాఖలను సూచిస్తాయి.

నాలుగు వర్ణాల ప్రజలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు; నాలుగు దిక్కులు తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం కూడా స్వస్తిక్ నాలుగు శాఖలు సూచిస్తాయి. స్వస్తిక్ కేంద్ర బిందువును విష్ణు భగవానుడి నాభిగా భావిస్తారు, అక్కడ నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.

* హిందూ మతంలో దీనిని ఎందుకు గీస్తారు?

స్వస్తిక అనే సంస్కృత పదానికి "పవిత్రమైనది, శుభప్రదమైనది" అని అర్థం. అందువల్ల, ఈ చిహ్నాన్ని రోజువారీ పూజా కార్యక్రమాలలో ఎవరైనా పూజించినా లేదా ఉపయోగించినా వారికి శుభం, సంతోషం లభిస్తాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఏదైనా మతపరమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు స్వస్తిక్ గుర్తును చిత్రిస్తారు. ఇది అనేక శుభ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది శాంతిని పెంపొందిస్తుంది, ఇంటిని ప్రతికూల శక్తి నుంచి రక్షిస్తుంది. ఈ శుభ చిహ్నం నిర్వహించబోయే కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.

2024-05-02T12:45:36Z dg43tfdfdgfd