పసుపుతో హెయిర్ కేర్.. జుట్టును బలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి!

అందరి వంటిట్లో లభించే పసుపు (Turmeric) కేవలం వంటల్లో వాడే మసాలా దినుసు మాత్రమే కాదు. దీనితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. విశేషమైన ఔషధ గుణాలు ఉన్న పసుపును ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. ఇది డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది, చర్మానికి మెరుపును అందిస్తుంది. అంతేకాదు జుట్టుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. పసుపు జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రును దూరంగా ఉంచుతుంది. హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ మూలికను ఎలా వాడాలో తెలుసుకోండి.

* జుట్టు రాలడానికి చెక్

స్కిన్ ఇన్‌ఫ్లమేషన్‌ జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణం. అయితే పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు స్కిన్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రలైజ్ చేస్తాయి.

* స్కాల్ప్ హెల్త్

పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు స్కాల్ప్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. ఇది మాడుపై ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. చుండ్రు వంటి సమస్యలకు కళ్లెం వేస్తుంది.

* బలమైన కుదుళ్లు

పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం, జుట్టు కుదుళ్లను వృద్ధి చేసే కణాలను ఉత్తేజపరుస్తుంది. అందువల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. పసుపు మాడుకు రక్త ప్రసరణను పెంచి కుదుళ్లకు ఎక్కువ పోషకాలు అందిస్తుంది. ఇందులోని యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఫంగస్ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి. తద్వారా హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయి.

* పర్యావరణ కారకాల నుంచి ప్రొటెక్షన్

ఫ్రీ రాడికల్స్ జుట్టు, మాడు, చర్మానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. పసుపులోని యాంటీఆక్సిడెంట్లు ఈ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, జుట్టును రక్షిస్తాయి.

* చుండ్రు దూరం

పసుపులో యాంటీ-ఫంగల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యను పోగొడతాయి. పసుపులోని కర్కుమిన్ చుండ్రుకు కారణమయ్యే శిలీంధ్రాలను చంపేస్తుంది. దీంట్లోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చికాకుపెట్టే స్కాల్ప్‌ను శాంతపరచుతాయి.

* ఎలా వాడాలి?

పసుపుతో ఇంట్లోనే కొన్ని నేచురల్ రెమిడీస్ ట్రై చేయవచ్చు. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టుకు పట్టించి, 30 నిమిషాలు అలాగే ఉంచాలి. చివరగా, మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ టర్మరిక్ హెయిర్ మాస్క్ జుట్టు పెరుగుదలను పెంపొందిస్తుంది.

ఇది కూడా చదవండి: గర్ల్‌ఫ్రెండ్ బర్గర్ తిన్నాడు.. చివరికి మర్డర్ అయిపోయాడు.. ఇలా ఉన్నారేంటి రా బాబు..!

ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 కప్పు నీరు యాడ్ చేసి బాగా కలపాలి. జుట్టును షాంపూతో శుభ్రం చేసుకున్నాక, ఈ పసుపు రిన్స్‌ను జుట్టుపై పోసి, కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. చివరగా గోరువెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి. ఈ టర్మరిక్ హెయిర్ రిన్స్‌తో మంచి రిజల్ట్స్ ఉంటాయి.

ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ పసుపు పొడిని, కొద్ది మొత్తం షాంపూ కలపాలి. జుట్టును తడిపి, ఈ షాంపూతో స్కాల్ప్, జుట్టును మర్దన చేయాలి. 2-3 నిమిషాలు అలానే ఉంచి, తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ టర్మరిక్ షాంపూ అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్‌కు చెక్ పెడుతుంది.

ఒక గిన్నెలో 1/4 కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్, 1 టీస్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయాలి. నూనె వేడిగా మారాక స్టవ్ ఆఫ్ చేసి, చల్లబరచాలి. స్కాల్ప్, జుట్టుకు ఈ టర్మరిక్ హెయిర్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి. రాత్రంతా నూనెను అలానే ఉంచి, మరుసటి రోజు ఉదయం షాంపూతో స్నానం చేయాలి. ఈ ఆయిల్‌తో జుట్టు సమస్యలన్నీ పోతాయి, హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.

* దుష్ప్రభావాలు

పసుపు తాత్కాలికంగా చర్మం, జుట్టును పసుపు రంగులోకి మార్చేస్తుంది. కాబట్టి, ఉపయోగించిన తర్వాత అది పోయేలా శుభ్రం చేసుకోవాలి. కొందరికి తలచర్మంపై అలర్జీలు రావచ్చు, ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ రిస్క్ ఉంటుంది. తలకు పసుపు పెట్టుకునే ముందు ఒక చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఎక్కువసేపు పసుపు జుట్టుపై ఉంటే అది పొడిబారి చిక్కుముడులకు దారితీస్తుంది. కొందరిలో పసుపు కారణంగా స్కిన్ అలర్జీలు లేదా ఇతర తీవ్రమైన అలర్జీలు రావచ్చు.

2024-04-26T10:21:19Z dg43tfdfdgfd