చిలుకూరు ఆలయం: గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా? జనం పోటెత్తడంతో రోడ్లపై నిలిచిన వేలాది వాహనాలు..

తెల్లారేసరికి వేలాది వాహనాలు హైదరాబాద్ శివారులోని చిలుకూరుకు క్యూ కట్టాయి. హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది.

గరుడ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందన్న ప్రచారమే ఇందుకు కారణం. గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయానికి భారీ సంఖ్యలో వచ్చారు భక్తులు.

ఏప్రిల్ 19వ తేదీ ఉదయం ఎనిమిది అయ్యేసరికి చిలుకూరు వెళ్లే దారులన్నీ నిండిపోయాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.

ఇంతకూ గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారన్న ప్రచారం ఎలా మొదలైంది? దీనిపై ఆలయం నిర్వాహకులు, వైద్యులు, జనవిజ్జాన వేదిక ప్రతినిధులు ఏమంటున్నారు?

అసలేం జరిగిదంటే

చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏటా చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. శ్రీరామ నవమి తర్వాత రెండో రోజు, అంటే తెలుగు నెలల ప్రకారం చూస్తే చైత్ర మాసం ఏకాదశి రోజున బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. మొదటి రోజున గరుత్మంతుడి పూజ చేస్తారు. ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా గరుత్మంతుడికి పెద్ద బుట్టలో నైవేద్యం పెడతారు. ఆ తర్వాత దాన్ని అక్కడికి వచ్చిన ‌భక్తులకు పంపిణీ చేస్తుంటారు.

ఈ ప్రసాదం పంపిణీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రచారం చేస్తున్నారు.

గరుత్మంతుడికి నైవేధ్యం పెట్టాక అందులోని దద్దోజనం తరహా ప్రసాదాన్ని ‌‍భక్తులకు ఇస్తుంటారు. దీన్ని కేవలం మహిళలకే ఇస్తున్నారు. ఇది తింటే సంతానం కలుగుతుందని ఆలయ అర్చకులు అక్కడి మైకుల్లో ప్రచారం చేస్తుంటారు. కేవలం మహిళలే ప్రసాదం తీసుకోవాలని, సంతానం లేని వాళ్లే తీసుకోవాలని చెబుతుంటారు.

ఈ ప్రసాదం తీసుకుని తినేందుకు ఏటా 5 వేల నుంచి 8 వేల మంది వస్తుంటారని అంచనా. వారికి తలా కొంత ప్రసాదం ఇస్తారు.

ఈసారి ఎందుకిలా జరిగింది?

ఈ ఏడాది ఉగాది పండుగ నాడు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వాహకులు విడుదల చేశారు. అప్పటి నుంచి మొదటి రోజున గరుడ ప్రసాదం పంచుతామంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం చే‌‍శారు ఆలయ అర్చకులు.

ఫేస్‌బుక్, ఎక్స్, ‌ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో వీడియోలు, ప్రెస్ రిలీజుల ద్వారా ప్రచారం చేశారు. పత్రికల్లోనూ ప్రకటనలు ఇచ్చారు.

దీంతో, సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు వేల సంఖ్యలో వచ్చారు.

కేవలం హైదరాబాద్‌ వారే కాదు, తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు.

వీరే కాకుండా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఇతర భక్తులు ఉన్నారు. వీరంతా ఒక్కసారిగా చిలుకూరు ఆలయానికి రావడంతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి.

చిలుకూరు నుంచి లంగర్ హౌస్, నానల్ నగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, అప్పా జంక్షన్ ఇలా దారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి.

పైగా ఎండ కూడా ఎక్కువగా ఉండటంతో తాండూరు, వికారాబాద్, కొడంగల్ వెళ్లే వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సాయంత్రం వరకు ట్రాఫిక్ బాధలు కొనసాగాయి.

‘వెయ్యి రెట్లు ఎక్కువగా వచ్చారు..’

‘‘సంతానం ఆశించే భక్తులకు గరుడ ప్రసాదం ఇస్తుంటాం. కానీ, మేం అనుకున్న దాని కంటే వెయ్యి రెట్లు ఎక్కువ మంద భక్తులు వచ్చారు. అయినప్పటికీ చాలా మందికి ప్రసాదం ఇచ్చాం. చాలా మందికి ప్రసాదం దొరక్క అవస్థలుపడ్డారు. ప్రతిసారి మూడు, నాలుగు రోజులపాటు ప్రసాదం ఇచ్చేవాళ్లం. ఈసారి మాత్రం ఇవ్వడం లేదు. శుక్రవారంతోనే ప్రసాదం ఇవ్వడాన్ని నిలిపివేశాం’’ అని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ చెప్పారు.

వేలాదిగా వచ్చే భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్న విషయంపై ఆయన సమాధానం చెప్పలేదు.

‘‘మేం చూసిన, వేసుకున్న అంచనా ప్రకారం ఉదయం పదిన్నర, పదకొండు గంటలకే 60 వేల మంది భక్తులు వచ్చారు. పది వేల మంది వస్తేనే చిలుకూరు ఆలయం రోడ్డు వాహనాలతో నిండిపోతుంది. అలాంటిది ఇంత భారీ స్థాయిలో వస్తారని అంచనా వేయలేదు. అందుకే ట్రాఫిక్ అలా నిలిచిపోయింది’’ అని మెయినాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి చెప్పారు.

మనిషిని కాదు, పరిస్థితులను తప్పు పడుతున్నాం: జేవీవీ

‘‘ప్రసాదం తింటే పిల్లలు పుడతారనే నమ్మకాలను ఇంకా విశ్వసిస్తున్నారంటే.. నేను ప్రజలను తప్పు పట్టను కాని వాళ్లను అలా ఉంచిన పరిస్థితులను తప్పు పడతాను’’ అని జన విజ్జాన వేదిక(జేవీవీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు అన్నారు.

ఈ విషయంపై ఆయన బీబీసీతో మాట్లాడారు.

‘‘ఒకప్పుడు మూఢనమ్మకాలతో చెట్లకు, స్వాములకు పూజలకు చేయడం చూసేవాళ్లం. ఆ రోజున పరిస్థితులు అలా ఉండేవి కాబట్టి తప్పు పట్టడానికి లేదు. కానీ, ఇప్పుడు ఇంతగా సైన్స్ విజ్ఞానం పెరిగిన తర్వాత, పిండం ఏర్పడే విధానం గురించి తెలిసిన తర్వాత కూడా ప్రజలు ఇలా వెళ్తున్నారంటే ఏం చెప్పాలి? ఇది దేశంలో విజ్జాన శాస్త్ర దారిద్య్రం అనాలి’’ అని ఆయన అన్నారు.

ఇలాంటివి నమ్మేవా‌ళ్లలో చదువుకున్న వ్యక్తులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేవాళ్లున్నారంటే, ఏమనాలో అర్థం కావడం లేదన్నారు వెంకటేశ్వరావు.

‘‘మన సైన్స్‌కు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ మూఢనమ్మకాలు అనేవి వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. దానివల్ల సైన్స్ కంటే ఎక్కువగా మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. మన సమాజంలో రావాల్సినంత చైతన్యం ఇంకా రాలేదు’’ అని ఆయన చెప్పారు.

వీసాల దేవుడిగా పేరు

ఈ వ్యవహారంతో ఒక్కసారిగా చిలుకూరి బాలాజీ ఆలయంపై చర్చ సాగుతోంది.

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో చిలుకూరు బాలాజీ ఆలయం ఉంటుంది. హైదరాబాద్-బీజాపూర్ హైవే ద్వారా ఈ ఆలయానికి వెళ్లాలి.

చిలుకూరు బాలజీని ఎక్కువగా ‘వీసాల దేవుడు’ అని పిలుస్తారు భక్తులు. విదేశాలకు వెళ్లే వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే త్వరగా వీసా వస్తుందనే ప్రచారం ఉంది.

భక్తులు తమ కోరికలు కోరే ముందు 11 సార్లు ఆలయం చుట్టూ తిరగడం.. కోరిక నెరవేరిందని భావిస్తే 108 సార్లు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.

ఇక్కడ మూల విరాట్‌ను బాలాజీగా పిలుస్తారు. దేవతను రాజ్యలక్ష్మిగా పిలుస్తారు.

సా‌‍ధారణంగా ఆలయాల్లో హుండీ కనిపిస్తుంది. ఇక్కడ హుండీ అనేది ఉండదు.

ఆలయం తరఫున ప్రచురించే ధార్మిక పత్రికను కొనుక్కొనేందుకు ఆలయ అర్చకులు ప్రోత్సహిస్తుంటారు.

ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది కానీ దేవదాయ శాఖ పరిధిలో లేదు. గతంలో ఆలయ ధర్మకర్తలు, దేవదాయ శాఖ మధ్య వివాదం నడిచింది. హైకోర్టులో కేసులు నడిచాయి. కోర్టు తీర్పు ప్రకారం ఆలయ నిర్వహణ ధర్మకర్తల చేతిలోనే ఉండిపోయింది.

దీనికి ప్రధాన అర్చకులుగా సీఎస్ రంగరాజన్ వ్యహరిస్తున్నారు.

ఆలయం ఎప్పుడు కట్టారన్న విషయంపై.. చిలుకూరు క్షేత్ర చరిత్ర అనే పుస్తకం ప్రకారం చూస్తే 1067వ సంవత్సరంలో కట్టారని తెలుస్తుంది.

పెరుగుతున్న సంతనలేమి సమస్యలు

గరుడ ప్రసాదం తీసుకునేందుకు వేలాది మంది తరలిరావడం సంతాన లేమి సమస్యలపై చర్చకు దారి తీసింది. వివి‌‍ధ కారణాలతో సంతానం లేని దంపతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.

2019-20లలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 లోని శాంపిల్స్‌పై పరిశోధకులు వరుణ్ అగర్వాల్, ఆర్. సాయిమాధురి, శిర్సేందు చౌధురి విశ్లేషించారు.

సంతానలేమితో ఉన్న 4,91,484 మంది మహిళలపై చేసిన పరిశోధన గురించి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిక్ ఒక ఆర్టికల్‌ను ప్రచురించింది.

వీరిలో ప్రతి వెయ్యి మందిలో 18.7 మంది పెళ్లయిన ఐదేళ్ల తర్వాత కూడా సంతానలేమి సమస్యతో బాధ పడుతున్నారు.

పెళ్లయిన ఏడాదిలోపల ప్రతి వెయ్యి మంది మహిళల్లో 42.9 మందికి సంతానలేమి సమస్య ఉండగా.. పెళ్లై రెండేళ్లయిన వారిలో 30.7 మంది, మూడేళ్లు అయిన వారిలో 24.1 మంది, నాలుగేళ్లు అయిన వారిలో 20.7 మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలింది.

పెళ్లయ్యాక అయిదేళ్ల తర్వాత కూడా తెలంగాణలో ప్రతీ వెయ్యి మంది మహిళల్లో 25.7 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 24.4 శాతం మహిళలు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.

‘‘సంతానోత్పత్తి రేటు తగ్గడానికి ప్రస్తుతం ఎన్నో కారణాలు ఉన్నాయి. మహిళల్లో పెరుగుతున్న పీసీఓడీ (పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్) సమస్యలు ఇందుకు ప్రధానంగా కారణమవుతున్నాయి. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడం కూడా కారణమే. ఈ సమస్యలకు ఒత్తిడి, జీవన శైలిలో మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, మద్యం తాగడం.. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి’’ అని గుంటూరుకు చెందిన ఒక గైనకాలజిస్టు చెప్పారు.

‘‘ప్రసాదం తింటే పిల్లలు పుడతారనేది సైన్స్ కాదు, అది పూర్తిగా సైన్స్‌కు విరుద్ధం. అలాగే అదే సమయంలో అది మనిషి విశ్వాసం’’ అని ఆ గైనకాలజిస్ట్ అన్నారు. తన పేరు చెప్పడానికి వారు ఇష్టపడలేదు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-20T03:54:43Z dg43tfdfdgfd